తెలంగాణా రాష్ట్రంలో జరిగిన దిశ హత్యాచారం ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే, ఈ ఘటనలో జరిగిన నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసు విషయంలో పేర్కొన్న పూర్తి వివరాలతో ఉన్న నివేదికను ఎన్‌హెచ్‌ఆర్సీ బృందానికి షాద్‌నగర్, శంషాబాద్‌ పోలీసులు మంగళవారం  సమర్పించారు.

 

 

ఇందులో నవంబర్‌ 27 నుంచి ఈ నెల 6 వరకు అసలేం జరిగిందన్న దానిపై పూర్తి వివరాలు, ఆధారాలు, ఫోరెన్సిక్‌ రిపోర్టుతో పాటుగా సమర్పించారు. ఈ నివేదికలో నలుగురు నిందితులది నేరస్వభావమని, తమపై దాడి చేసి కాల్చ బోయారని, అందుకే ఆత్మరక్షణ కోసం చీకట్లోనే వారివైపు ఎదురు కాల్పులు జరిపామని పోలీసులు పేర్కొన్నట్లు తెలిసింది.

 

 

ఇకపోతే విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గత నెల 27న రాత్రి 9.40 గంటలకు శంషాబాద్‌ టోల్‌గేట్‌ వద్ద దిశను అపహరించిన మహమ్మద్‌ ఆరిఫ్, నవీన్, శివ, చింతకుంట చెన్నకేశవులు హత్యాచారం చేసినట్లు వివరించారు.

 

 

ఘటన జరిగిన రోజు బాధితురాలితో మాట్లాడిన టోల్‌గేట్‌ సిబ్బంది, నిందితులు మాట్లాడిన పంక్చర్‌ షాపు, వైన్‌షాపు యజమానులు, లారీ ఓనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, కొత్తూరు, నందిగామ పెట్రోల్‌ బంకు సిబ్బంది వంటి ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించిన వివరాలను పోలీసులు ఈ నివేదికలో పొందు పరిచారు.

 

 

దిశపై అత్యాచారం జరిగిందని నిరూపించేందుకు కావాల్సిన ఫోరెన్సిక్‌ రిపోర్టు, లారీలో సేకరించిన రక్తం నమూనాలు, ఇతర స్రావాలు, వెంట్రుకలు, నిందితుల డీఎన్‌ఏ ప్రొఫైలింగ్‌ రిపోర్టును కూడా పోలీసులు నివేదికకు జతపరిచారని సమాచారం. తాము ఆత్మరక్షణ కోసం వారివైపు చీకట్లోనే ఎదురు కాల్పులు జరిపామన్నారు. నిందితుల వైపు నుంచి కాల్పులు ఆగిపోయాక.. తెల్లవారుజామున గాలించగా సమీపంలోని పొలంలో నలుగురు మరణించినట్లు గుర్తించామని, అంతే తప్ప ఎవరినీ గురి చూసి కాల్చలేదని వివరించారని తెలిసింది.

 

 

ఇకపోతే ఇలాంటి పలు విషయాలపైనా ఎన్‌హెచ్‌ఆర్సీ బృందానికి పోలీసులు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ఇక ఈ ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు పోలీసులను ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం సోమవారమే విచారించిన విషయం తెలిసిందే.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: