దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణ రోజుకో మలుపు తీసుకొంటోంది. నిన్న ఎన్‌హెచ్‌ఆర్సీ బృందానికి ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన తమ కుమారులు మైనర్లు అంటూ చనిపోయిన నిందితుల యొక్క కుటుంబ సభ్యులు బోనఫైడ్ సర్టిఫికెట్సును అందజేశారు. ఒకవేళ నిందితుల్లో మైనర్లు ఉన్నారని తేలితే పోలీసులకు చిక్కులు తప్పవు. మరోవైపు నేడు దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది, ఈ నేపథ్యంలో నిన్ననే సీపీ సజ్జనార్ ఢిల్లీ వెళ్లారు.

 

దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగాక ప్రెస్ మీట్ లో సీపీ సజ్జనార్ మాట్లాడిన ఒక మాట ఎన్‌కౌంటర్‌పై అనుమానాలకు తావిస్తోందని తెలుస్తోంది. ప్రెస్ మీట్ లో ఒక ఆంగ్ల దినపత్రిక రిపోర్టర్ "సార్ నిందితులు పోలీసుల నుంచి పిస్తోళ్లు లాక్కున్నారు అని చెప్తున్నారు కదా, మరి ఆ పిస్తోళ్ళతో మీపై కాల్పులు జరపాలంటే వాటిని అన్లాక్ చెయ్యాలిగా, నిందితులు పిస్తోళ్ల లాక్ ఎలా తీశారు" అని ప్రశ్నించగా సజ్జనార్ "పిస్తోళ్లు అప్పటికే అన్లాక్ అయ్యి ఉన్నాయి" అని చెప్పారు. సాధారణంగా లాక్ పొజిషన్లో ఉండాల్సిన పిస్తోళ్లు ముందే అన్లాక్ ఎలా అయ్యాయి అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

పోలీసులే పిస్తోళ్లను అన్లాక్ చేసి నిందితులకు ఇచ్చారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. సజ్జనార్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఈ విషయంపైనా సుప్రీంలో అడిగే అవకాశం ఉంది. "నిందితులు ముందుగా పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చెయ్యడానికి యత్నించారు, ఆ సమయంలో వారిని భయపెట్టేందుకు మేము పిస్తోళ్లు బయటకి తీసి బెదిరించాలని చూసాం ఆ క్రమంలో వాటి లాక్ తీసాం" అని సజ్జనార్ చెప్పే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఎన్‌కౌంటర్‌ నకిలీదని తేలితే పోలీసులు తమ ఉద్యోగాలు పోగొట్టుకోవడమే కాకుండా జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. గతంలో సొహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్‌లో పోలీసులు ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నారో తెలిసిందే. సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులను తీహార్ జైలుకు తరలించారు. దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణకు చేపట్టడానికి వచ్చిన ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం దాదాపుగా విచారణ పూర్తి చేయడంతో నేడో, రేపో తిరిగి వెళ్లిపోనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: