అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి వ్యూహంతో చంద్రబాబునాయుడుకు పెద్ద షాకే ఇచ్చారు. తెలుగుదేశంపార్టీ తిరుగుబాటు ఎంఎల్ఏ వల్లభనేని వంశీని అసెంబ్లీలో ఇండిపెండెంట్ ఎంఎల్ఏగా గుర్తిస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన ప్రకటనతో చంద్రబాబు అండ్ కో కు పెద్ద షాక్ తగిలింది. వంశీ విషయంలో జగన్ అనుసరించిన మూడు రకాల వ్యూహాలను టిడిపి సభ్యులు ఏమాత్రం ఊహించలేదు.

 

వంశీ ని ఇండిపెండెంట్ ఎంఎల్ఏగా స్పీకర్ పరిగణిస్తారని చంద్రబాబు అనుకోలేదు. అలాగే వైసిపిలో చేర్చుకోకుండానే వంశీని తనపైకి ప్రయోగిస్తారని చంద్రబాబు అస్సలు ఊహించలేదు. అదే విధంగా చివరిది ప్రధానమైన   పాయింట్ ఏమిటంటే టిడిపి నుండి బయటకు వచ్చేయాలని అనుకుంటున్న ఎంఎల్ఏలను కూడా ఇండిపెండెంట్ సభ్యులుగానే గుర్తిస్తామనే సంకేతాలను స్పీకర్ పంపారు.

 

తాజాగా స్పీకర్ పంపిన సంకేతాలతో సభ్యత్వాలు పోకుండానే స్వతంత్రులుగా కొనసాగటమంటే చాలామంది ఎంఎల్ఏలు సంతోషమే కదా. ఇటు టిడిపి నుండి బయటపడినట్లు అవుతుంది. అటు అధికార వైసిపితో రాసుకుపూసుకు తిరుగుతూ తమ సొంతపనులను చక్కబెట్టుకునేందుకు అవకాశాలు దక్కుతాయి. అదే సమయంలో చంద్రబాబును కానీ టిడిపిని కానీ జగన్ ను సంతోష పెట్టటానికి నోటికొచ్చినట్లు మాట్లాడొచ్చు.

 

అదే సమయంలో వైసిపిలో చేరాలని అనుకుంటున్న ఎంఎల్ఏలు ముందు తమ పదవులకు రాజీనామా చేయాలన్న జగన్ షరతుకు కూడా ఎటువంటి భంగం కలగదు. అంటే జగన్ చెప్పిన మాటను తప్పటం లేదనే సంకేతాలు జనాల్లోకి బలంగా వెళుతుంది. అదే సమయంలో ఏ ఏడుగురు ఎంఎల్ఏలు వంశీ బాటలోనే నడిస్తే చంద్రబాబుకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఎగిరిపోతుంది.

 

ఇదంతా ఎందుకంటే చంద్రబాబు స్వయంకృతమనే చెప్పుకోవాలి. అధికారంలో ఉన్నపుడు వైసిపి ఎంఎల్ఏలను, ఎంపిలను ప్రలోభాలకు గురిచేసి టిడిపిలోకి లాక్కోకుండా ఉండుంటే ఇపుడీ పరిస్ధితి చంద్రబాబుకు వచ్చేది కాదు. మొత్తానికి జగన్ వ్యూహాలకు చంద్రబాబు విలవిలల్లాడిపోతున్నట్లు అర్ధమైపోతోంది. చూద్దాం ఆ ముచ్చట ఎప్పటిలోగా పూర్తవుతుందో.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: