రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసులో పోలీసులు ఆత్మరక్షణ కోసం నిందితులను ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. పోలీసుల ఎన్ కౌంటర్ లో మరణించిన మృతుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారని అనుమానాలు వ్యక్తం కావటంతో మృతి చెందిన నిందితుల వయస్సును ఎలా నిర్ధారిస్తారనేది ఆసక్తికరంగా మారింది. శాస్త్రీయ పద్దతులను అనుసరించి నిందితుల వయస్సును నిర్ధారించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.
 
ఒస్సిఫికేషన్ టెస్ట్ ద్వారా మృతుల వయస్సును నిర్ధారించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్ట్ చేసిన సమయంలో పోలీసులు అరీఫ్ వయస్సును 26 సంవత్సరాలుగా నమోదు చేయగా జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు వయస్సును 20 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నట్లుగా నమోదు చేశారు. పోలీసులు నిందితులు చెప్పిన వివరాల ఆధారంగా వయస్సును నమోదు చేశామని చెబుతున్నారు. 
 
ఆధార్ కార్డు ప్రకారం నవీన్, చెన్నకేశవులు, శివ 2001 సంవత్సరంలో జన్మించినట్లుగా ఉంది. కానీ బోనఫైడ్ సర్టిఫికెట్లలో మృతులలో ఒకరు 2002 సంవత్సరం ఆగష్ట్ 15వ తేదీ పుట్టినట్లుగా, మిగతా ఇద్దరు 2004 సంవత్సరంలో పుట్టినట్లుగా నమోదైంది. బోనఫైడ్ సర్టిఫికెట్ల ప్రకారం నిందితులలో ముగ్గురు మైనర్లు అని తెలుస్తోంది. ఈ కేసులో ఫోరెన్సిక్ వైద్య నిపుణులు ఎముకల ధృడత్వాన్ని పరీక్షించడం ద్వారా వయస్సును అంచనా వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

సాధారణంగా ఫోరెన్సిక్ నిపుణులు ఎముకల ధృడత్వాన్ని పరిశీలించడం ద్వారా వయస్సు నిర్ధారణపై అంచనాకు వస్తారు. కేసుల విచారణ క్రమంలో ప్రామాణికంగా ఈ నివేదికనే తీసుకుంటారు. దిశ హత్య కేసు నిందితులు మృతి చెందడంతో నిందితుల వయస్సును ఎలా నిర్ధారణ చేస్తారనే విషయం తెలియాల్సి ఉంది. మరోవైపు నిందితుల శరీరాల్లో తూటాలు లభ్యం కాలేదు. నిందితులు ఎవరి తూటాలతో మృతి చెందారో తేలట్లేదు. అధికారులు ఆయుధగారంలోని రికార్డుల ఆధారంగా తూటాల లెక్క తేల్చాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: