మూడు పోలీస్ స్టేషన్లకు తిరిగినా.. మా పరిధి కాదంటే మా పరిధి కాదంటూ మిస్సింగ్ కేసును సత్వరంగా నమోదు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని... అందుకే తన కూతురు చనిపోయిందని దిశ తండ్రి పడిన ఆవేదన మరవలేనిది. దిశ నిందితుల ఎన్కౌంటర్ జరిగిన తర్వాత కూడా.. అల్పంగా సంతోషించి.. పోలీసులు తక్షణమే స్పందించినట్లైతే తమ బిడ్డ బ్రతికేదంటూ తమ బాధను వ్యక్తం చేశారు. అనేక సందర్భాలలో... తమ బిడ్డకు వచ్చిన పరిస్థితి ఎవరికీ రాకుండా.. పోలీసులను సత్వరమే స్పందించాలంటూ వారికి విజ్ఞప్తి కూడా చేశారు. కానీ తాజాగా జరిగిన సంఘటన చూస్తే పోలీసులు ఏం మారలేదు అని స్పష్టమవుతుంది.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాదులోని బుద్ధానగర్ లో ఒక దళిత కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు. కుటుంబ పెద్దయిన తండ్రి చనిపోగా... తల్లి కూరగాయలు అమ్ముతూ తన కూతురు రాణి(18)ని వెస్ట్ మారేడిపల్లిలోని వెస్లీ కాలేజ్ లో ఇంటర్మీడియట్ చదివిస్తోంది. గతనెల నవంబర్ 21వ తారీఖున కాలేజీకు వెళ్లిన తన బిడ్డ.. ఇంటికి రాకపోవడంతో తల్లి.. 'ఏముందో ఏమో నా బిడ్డకు' అని కంగారు పడుతూ తెలిసిన ప్రతి ఒక్కరిని అడిగింది. కానీ తన బిడ్డ ఆచూకీ మాత్రం లభించలేదు. దాంతో నవంబర్ 22న తుకారాంగేట్‌ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అప్పుడుు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసారు. తన కూతురితో భాగ్యరాజ్‌, కమల్‌ అనే యువకులు తరచూ ఫోన్లో మాట్లాడే వారని తల్లి పోలీసులకు చెప్పింది. వారిపైనే తన అనుమానం అని పోలీసులకి స్పష్టంగా చెప్పి... వారిని విచారించవలసిందిగా కోరింది. సరే అలాగే చేస్తామని చెప్పి పోలీసులు ఆమెను పంపించేశారు.

కానీ.. పోలీసులు.. రాణి ఆచూకీ కోసం ఏనాడూ వెతికిన పాపాన పోలేదు. తల్లి అనుమానం వ్యక్తం చేసిన యువకులను కూడా పిలిచి విచారించనూ లేదు. సమీపంలో ఉన్న ఇతర పోలీస్ స్టేషన్ లకి కూడా ఎటువంటి సమాచారం అందించలేదు. రైల్వే స్టేషన్లలో, ఇంకా ఏ ప్రాంతాలకు వెళ్ళిన దాఖలాలే లేవు.

ఇకపోతే లేక్ పోలీసులు నవంబర్ 23న హుస్సేన్ సాగర్ వద్ద గుర్తుతెలియని బాలిక మృతదేహాన్ని స్వీకరించి ఆపై గాంధీ హాస్పిటల్ కి తరలించారు. కనీసం ఈ విషయాన్ని కూడా తుకారంగేట్ పోలీసు సిబ్బంది కనుక్కోలేకపోయారు. దాదాపు ఐదు రోజుల పాటు శవం హాస్పటల్ లో ఉండటంతో... దుర్వాసన పడుతుందనే ఉద్దేశంతో గాంధీ ఆస్పత్రి వైద్యులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి.. పోలీసులకు నవంబర్ 28న సమాచారం అందించారు. గత నెల 28వ తారీఖు సమాచారం అందిస్తే, ఈ నెల డిసెంబర్ 8వ తారీఖున గాంధీ ఆసుపత్రికి పోలీసులు వెళ్లి.. శవానికి సంబంధించిన వివరాలను సేకరించి పోలీస్ స్టేషన్ కి వచ్చేశారు. ఆ తర్వాత రాణి తల్లికి.. గాంధీ హాస్పిటల్ లో ఒక శవం ఉందని, ఒకసారి వెళ్లి చూడమని చెప్పారు. దాంతో బాలిక తల్లి గాంధీ ఆస్పత్రికి వెళ్లి.. మృతదేహం యొక్క వస్త్రాలను గుర్తుపట్టి.. ఆ చనిపోయింది తన కూతురు రాణినేనని బోరున విలపించింది.

ఆ తర్వాత తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి... ఖాకీలు నిర్లక్ష్యంగా వ్యవహరించి, తన బిడ్డ ఎప్పుడో చనిపోతే ఇప్పుడు తెలియజేశారు!! అంటూ ఆందోళన చేపట్టారు. ఇంకా తీవ్ర నిరసన చేపట్టి పోలీసులని నిలదీశారు.. దాంతో పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా.. రాణి 22వ తారీకు ట్యాంక్ బండ్ వద్ద సంచరిస్తున్నట్లు గుర్తించారు. మొదట్లో సీసీ కెమెరాలను పరిశీలించి.. రాణి కోసం వెతికి నట్లయితే ఆమె ఖచ్చితంగా బతికి ఉండేదని పోలీసులను తిట్టి పోశారు. అనుమానితులైన భాగ్యరాజు, కమల్.. రాణిని చంపి ఉంటారని.. వారిని ఎందుకు ప్రశ్నించలేదని మహిళా సంఘం సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: