చంద్రబాబునాయుడు అత్తగారు నందమూరి లక్ష్మీ పార్వతికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నామినేటెడ్ ప్రభుత్వం ఇచ్చింది. అంటే లక్ష్మీపార్వతికి తెలుగు అకాడమి ఛైర్మన్ గా నామినేట్ చేసి చాలా రోజులే అయ్యింది. అయితే ఇపుడే  ఈ విషయం ఎందుకు ప్రస్తావన వచ్చింది ? ఎందుకంటే అసెంబ్లీలో మూడోరోజు నామినేటెడ్ పదవులపై పెద్ద ఎత్తున ఆరోపణలు, ప్రత్యారోపణలు రేగాయి.

 

కుల ప్రాతిపాదికన జగన్మోహన్ రెడ్డి తనకిష్టం వచ్చిన వాళ్ళకు నామినేటెడ్ పదవులు కట్టబెడుతున్నట్లు టిడిపి సభ్యుడు అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. నామినేటెడ్ పదవుల ముసుగులో కోట్ల రూపాయలను జగన్ ప్రభుత్వం వాళ్ళకు దోచిపెడుతోందంటూ మండిపడ్డారు.

 

దానికి సమాధానంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ తమ ప్రభుత్వం 70 నామినేటెడ్ పదవులు పదవులు ఇచ్చింది వాస్తవమే అని అంగీకరించారు. అలాగే టిడిపి హయాంలో సుమారు 270 మందిని కన్సల్టెంట్లుగా నామినేట్ చేసిన విషయాన్ని ఎందుకు ప్రస్తావించటం లేదంటూ నిలదీశారు. అవసరం లేకపోయినా దాదాపు 25 శాఖల్లో కన్సల్టెంట్లను నియమించుకుని చంద్రబాబునాయుడు కోట్లాది రూపాయలు చెల్లించలేదా అంటూ ప్రశ్నించారు. కన్నబాబు మాటకు షరా మామూలుగానే టిడిపి నుండి సమాధానం లేదనుకోండి అది వేరే సంగతి.

 

అదే సమయంలో జగన్ మాట్లాడుతూ ఇప్పటి వరకు తమ ప్రభుత్వం ఎవరెవరికి నామినేటెడ్ పదవులు ఇచ్చింది అన్న జాబితాను చదివి వినిపించారు. ఆ జాబితాను చదువుతునే తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ గా చంద్రబాబు అత్తగారు లక్ష్మీపార్వతిని కూడా నియమించిన విషయాన్ని గుర్తు చేశారు.

 

జగన్ ఒకటికి రెండుసార్లు చంద్రబాబు అత్తగారికి కూడా తమ ప్రభుత్వం పదవి ఇచ్చిందని అన్నపుడు చంద్రబాబు మాట్లాడకుండా తల ఊపుతూ కూర్చున్నారు. తమ ప్రభుత్వం నియమించిన వాళ్ళంతా ఆయా రంగాల్లో నిపుణులని భావించే నియమించినట్లు చెప్పారు. టిడిపి హయాంలో నియమితులైన వారిని ఎందుకు నియమించారని తాను ఎప్పుడూ ప్రశించలేదన్న విషయాన్ని జగన్ గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: