ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. చంద్రబాబు స్పీకర్ తమ్మినేని సీతారాంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు మైక్ ఇవ్వకపోవడంతో చంద్రబాబు " మర్యాదగా ఉండదంటూ" స్పీకర్ పై వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ చంద్రబాబు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరారు. స్పీకర్ తమ్మినేని సీతారాం చంద్రబాబుపై, తెలుగుదేశం పార్టీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
స్పీకర్ తమ్మినేని సీతారాం స్పీకర్ స్థానానికి కూడా గౌరవం ఇవ్వలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని అన్నారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని లేదంటే రికార్డుల నుండి నేను తొలగిస్తానని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చంద్రబాబుకు సభా మర్యాదలు తెలియవని, స్పీకర్ పై అమర్యాదగా మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. 
 
చంద్రబాబు స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచారని, స్పీకర్ ను పట్టుకొని మర్యాదగా ఉండదని అంటారా అని ప్రశ్నించారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తికి సభా మర్యాదలు తెలియవా...? అని ప్రశ్నించారు. బడుగు, బలహీనవర్గాలకు చెందిన వ్యక్తి స్పీకర్ స్థానంలో ఉంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని జోగి రమేశ్ మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే చంద్రబాబుకు వచ్చే నష్టం ఏమిటి అని జోగి రమేశ్ ప్రశ్నించారు. 
 
ఎమ్మెల్యే మేరుగ నాగార్జున చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని అన్నారు. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో విలువలు, విశ్వసనీయతకు పాతర వేశారని అన్నారు. చంద్రబాబు రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ స్పీకర్ స్థానాన్ని అగౌరవపరుస్తున్నారని అన్నారు. సీఎం జగన్ పేదవారి స్థితిగతులను మెరుగుపచటానికి కృషి చేస్తూ ఉంటే ప్రతిపక్ష సభ్యులు అడ్డుపడుతున్నారని అన్నారు. చంద్రబాబు ఇలాంటి సభలో ఉండకూడదని మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. దళితులు, బహుజనులు బతకడానికి చంద్రబాబు హయాంలో క్లిష్ట పరిస్థితులు ఉండేవని రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ చంద్రబాబునాయుడు స్పీకర్ స్థానాన్ని అగౌరవపరుస్తున్నాడని మేరుగ నాగార్జున చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: