మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. సభలో స్పీకర్ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. ఏపీ లోని ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు మీడియం స్కూళ్ల‌ పై చర్చ నడుస్తున్న సందర్భంగా తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని టీడీపీ నేతలు పట్టుబట్టారు. ఈ క్రమంలోనే వారు అరుస్తూ కేకలు వేయడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ తమ్మినేని ఇదేమన్నా ఖ‌వ్వాలీ డ్యాన్సా ?ఒక‌రి తర్వాత మరొకరికి అవకాశం ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యానించారు.

 

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రతిపక్షనేత చంద్రబాబు తన కుర్చీలో నుంచి లేచి స్పీకర్ తో వాగ్వాదానికి దిగారు. స్పీక‌ర్‌ మర్యాదగా ఉండాలంటూ త‌మ్మ‌నేనిని ఉద్దేశించి చంద్రబాబు వార్నింగ్ ఇవ్వడంతో సభలో ఒక్కసారిగా తీవ్ర గందరగోళం నెలకొంది. బాబు వ్యాఖ్యలపై స్పీక‌ర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పట్ల అనుచితంగా మాట్లాడారు అంటూ ఆయన ఫైర్ అయ్యారు. స్పీక‌ర్‌ను అవమానించారని ఆయన మండిపడ్డారు. మీరంటే నాకు గౌరవం ఉన్నా ఆరోపణలు చేస్తే మంచిది కాదని చంద్రబాబును హెచ్చరించారు. చంద్ర‌బాబు త‌న నోరు ను అదుపులో పెట్టుకుని మాట్లాడాల‌ని స్పీక‌ర్ హితవు ప‌లికారు.

 

ఇక స్పీక‌ర్ కుర్చీని బాబు ఎంత మాత్రం గౌర‌వించ‌డం లేద‌ని కూడా ఆయ‌న అన్నారు. బాబుకు ఇంత సీనియారిటీ ఉండి ఏం లాభం అని ప్రశ్నించారు. తనపై చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు తక్షణమే వెనక్కి తీసుకోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. మరోవైపు చంద్రబాబు వ్యాఖ్యలపై అధికార పక్షం భగ్గుమంది. ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్క‌సారిగా బాబు తీరును త‌ప్పు ప‌డుతూ తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డంతో అసెంబ్లీ లో వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా వేడెక్కిపోయింది. చంద్రబాబును సభ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మ‌రి ఈ విష‌యంలో స్పీక‌ర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: