మ‌రాఠాల ప్ర‌తీక‌గా రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొనే శివ‌సేన‌...రాష్ట్రంలో త‌న ప‌ట్టుబిగిస్తోంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన సంగ‌తి తెలిసిందే. మ‌హారాష్ట్రలో ప్రభుత్వం కొలువుదీరి రెండు వారాలు అవుతున్న త‌రుణంలో...మంత్రి ప‌ద‌వులు కొలిక్కివ‌చ్చిన‌ట్లు స‌మాచారం. సీఎం ఉద్దవ్ ఠాక్రేతో ఎన్సీపీ నాయకుడు అజిత్‌ పవార్‌ సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ నాయకులు బాలసాహెబ్‌ థోరట్‌ కూడా హాజరయ్యారు. ఈ మూడు పార్టీల స‌మావేశంలో శివ‌సేన పైచేయి సాధించిన‌ట్లు స‌మాచారం. ఇప్పటికే సీఎం పదవిని దక్కించుకున్న శివసేన కీలకమైన మ‌రో రెండు శాఖ‌లు సైతం సొంతం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.
 
 
మహారాష్ట్రలో శివసేన - కాంగ్రెస్‌ - ఎన్సీపీ నేతృత్వంలో ప్రభుత్వం కొలువుదీరగా.. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీ సమక్షంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయ‌న‌తో పాటుగా శివసేన పార్టీ నుంచి ఏక్‌నాథ్ షిండే, సీనియర్ నేత సుభాష్ దేశాయ్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఎన్సీపీ పార్టీ నుంచి జయంత్ పాటిల్, సీనియర్ నేత ఛగన్ భుజ్‌బల్  మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. కాంగ్రెస్ నుంచి బాలాసాహెబ్ థోరట్, నితిన్ రావత్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే, పార్టీ సభ్యులకు ఏయే మంత్రిత్వ శాఖలు కేటాయించాలనే అంశంపై గత కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతుంది. 
 
 
అయితే, త్వరలోనే మంత్రివర్గం కొలువుదీరనుందని, ముఖ్య‌మైన శాఖ‌ల పంప‌కం విష‌యంలో సీఎం ఉద్దవ్ ఠాక్రేతో ఎన్సీపీ నాయకుడు అజిత్‌ పవార్‌, కాంగ్రెస్‌ నాయకుడు బాలసాహెబ్‌ థోరట్‌ స‌మావేశంలో కొలిక్కి వ‌చ్చింద‌ని స‌మాచారం. హోంశాఖ, పట్టణాభివృద్ధి శాఖలను దక్కించుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సాయంత్రం ఎన్సీపీకి ఆర్థిక శాఖ, గృహ నిర్మాణ శాఖ, కాంగ్రెస్‌ పార్టీకి రెవెన్యూ శాఖ అప్పగించే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వెలువడుతున్నాయి. కీలకమైన పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్ విష‌యంలోనే ఉత్కంఠ నెల‌కొంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: