నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ సీ 48 రాకెట్ విజయవంతంగా దూసుకెళ్లింది. శ్రీహరి కోట నుండి ఇది 75వ ప్రయోగం కాగా పీఎస్‌ఎల్‌వీలలో ఇది 50వ ప్రయోగం కావటం గమనార్హం. 9 విదేశీ ఉపగ్రహాలతో పాటు ఒక రీశాట్‌-2 బీఆర్‌1 స్వదేశీ ఉపగ్రహంను ఇస్రో అంతరిక్షంలోకి పంపింది. నిన్న ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ మొదలైంది. కౌంట్ డౌన్ పూర్తయిన వెంటనే ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ 48 రాకెట్ ను ప్రయోగించారు. 
 
ఇస్రో అమెరికాకు చెందిన ఆరు ఉపగ్రహాలతో పాటు ఇటలీ, ఇజ్రాయెల్, జపాన్ కు చెందిన ఒక్కో ఉపగ్రహాన్ని రాకెట్ వివిధ కక్ష్యల్లో వదిలిపెట్టనుంది. పీఎస్‌ఎల్‌వీ సీ 48 రాకెట్ ప్రయోగంతో ఇస్రో మరో మైలురాయిని అందుకోనుంది. 15 రోజుల క్రితం ఇస్రో ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ సీ 47 ప్రయోగం సక్సెస్ కావటంతో మరింత ఉత్సాహంతో ఇస్రో పీఎస్‌ఎల్‌వీ సీ 48 ప్రయోగం చేపట్టింది. రిశాట్ ను శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని ఒకటో లాంఛ్ ప్యాడ్ నుండి ప్రయోగించింది. 
 
వాణిజ్యపరంగా ఇస్రో 319 విదేశీ ఉపగ్రహాలను కక్ష్యకు చేర్చింది. ఇప్పటివరకు ఇస్రో అమెరికా దేశానికి చెందిన 233 చిన్న ఉపగ్రహాలను రోదసిలోని కక్ష్యలోకి చేర్చింది. ఐదు సంవత్సరాల పాటు పీఎస్‌ఎల్‌వీ సీ 48 సేవలు అందించనుంది. రాకెట్ ప్రయోగం సక్సెస్ కావటంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇస్రో 2020 సంవత్సరంలో గగన్ యాన్ కు సిద్ధమవుతోంది. 
 
ఇస్రో ఛైర్మన్ శివన్ మాట్లాడుతూ చారిత్రాత్మకమైన 50వ పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ను ప్రయోగించామని చెప్పారు. శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ 48 ప్రయోగం 75వ ప్రయోగం అని అన్నారు. ఎందరో శాస్త్రవేత్తల కృషి 26 సంవత్సరాల నుండి ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ రాకెట్ విజయాలలో ఉందని అన్నారు. వివిధ రకాలుగా పీఎస్‌ఎల్‌వీని అభివృద్ధి చేశామని చెప్పారు. ఇస్రో భవిష్యత్తులో ఎన్నో ప్రయోగాలకు సిద్ధంగా ఉందని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: