2002వ సంవత్సరంలో ఇప్పటి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు గుజరాత్‌లో చెలరేగిన అల్లర్లపై ఏర్పడ నానావతి కమిషన్ ఇచ్చిన నివేదికను గుజరాత్ ప్రభుత్వం బుధవారం గుజరాత్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అప్పుడు జరిగిన గోధ్రా రైలు దుర్ఘటన అనంతరం చెలరేగిన ఘర్షణలు పథకం ప్రకారం చేసినవి కాదని, వీటిని నియంత్రించడంలో పోలీసులు విఫలం అయ్యారని నానావతి కమిషన్ ఇచ్చిన తన నివేదికలో పేర్కొన్నట్లు తెలిపింది.

 

వెయ్యి మందికి పైగా ముస్లింలు చనిపోయిన ఈ అల్లర్లలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న  నరేంద్ర మోదీ, అలాగే ఆయన క్యాబినెట్‌లోని మంత్రులకు నానావతి కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చింది. జస్టిస్ జీటీ నానావతి, అక్షయ్ మెహతాలు తమ నివేదికను 2014లో అప్పటి ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్‌కు సమర్పించారు. ఐదేళ్ల తర్వాత మంత్రి ప్రదీప్‌సింగ్ జడేజా దీనిని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

 

2002 ఫిబ్రవరి 27వ తేదీన గోధ్రా రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో అయోధ్య నుంచి తిరిగి వస్తున్న 59 మంది ‘కరసేవకులు’ చనిపోయారు. ఈ దుర్ఘటనలో వెయ్యి మందికి పైగా మైనార్టీ వర్గానికి చెందిన వారు చనిపోయారు. ఈ విషయంపై నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని చాలా మంది నిలదీశారు. దీంతో 2002లోనే నానావతి కమిషన్‌ను నరేంద్ర మోదీ ఏర్పాటు చేశారు. కాగా, అల్లర్లను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలనూ రాష్ట్ర యంత్రాంగం తీసుకుందని నానావతి కమిషన్ తన నివేదికలో తెలిపింది.

 

గోధ్రా రైలు దహనం తదనంతర అల్లర్లపై నానావతి కమిషన్ 2014 నవంబర్ 18వ తేదీన ఇచ్చిన నివేదికను మాత్రం ఐదేళ్ల పాటు బహిర్గతం చేయలేదు. అయితే, ఈ నివేదికను బయటపెట్టేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్‌బీ శ్రీకుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్‌లో స్పందిస్తూ రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ నివేదికను ప్రవేశపెడతామని హైకోర్టుకు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: