తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కేబినేట్ భేటీ జరుగుతోంది. కొద్దిసేపటి క్రితం మొదలైన కేబినేట్ భేటీలో కీలక అంశాలు చర్చకు రానున్నాయి. కేబినేట్ భేటీలో ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇరిగేషన్ అంశాల గురించి చర్చించనున్నట్టు తెలుస్తోంది. కేంద్రం తీరు గురించి, తాజా రాజకీయ పరిణామాల గురించి కూడా చర్చించబోతున్నట్లు సమాచారం. ఐదు గంటలకు కేబినేట్ సమావేశం మొదలైంది.
 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుండి రావాల్సిన నిధులు సకాలంలో రావటం లేదనే అభిప్రాయంలో ఉంది. అనేక సందర్భాల్లో కేంద్రానికి సహకరించినా కేంద్రం మాత్రం సహకరించటం లేదనే అభిప్రాయంలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. బీజేపీ పార్టీ గత కొన్ని రోజులుగా కేంద్రం నిధులు ఇస్తున్నా రాష్ట్రం నిధులను వినియోగించుకోవటం లేదని ప్రచారం చేస్తూ ఉండటంపై కూడా చర్చ జరగనుందని తెలుస్తోంది. 
 
దిశ ఘటన నేపథ్యంలో తాజా పరిణామాల గురించి, లోకాయుక్త చట్టసవరణ కోసం ఆర్డినెన్స్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చెంగిచెర్లలో లులూ సంస్థకు భూముల కేటాయింపు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి 14,075 కోట్ల రూపాయల రుణం, కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం నాబార్డ్ నుండి 1500 కోట్ల రూపాయలకు కేబినేట్ ఆమోదం తెలపనుంది. దుమ్ముగూడెం వద్ద కొత్త ఆయకట్టు నిర్మాణానికి 3481 కోట్ల రూపాయల పనులకు కేబినేట్ ఆమోదం తెలపనుంది. 
 
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఎల్లంపల్లి నుండి మిడ్ మానేరుకు 1.1 టీఎంసీల ఎత్తిపోతల పనులకు కేబినేట్ ఆమోదం తెలపనుంది. కొత్త రెవెన్యూ చట్టం, అసెంబ్లీ శీతాకాల సమావేశాల తేదీలు, ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల అమలు గురించి కూడా చర్చ జరగనుందని తెలుస్తోంది. ఒక కీలక చట్టానికి సవరణలు చేస్తూ జారీ చేయనున్న ఆర్డినెన్స్ కు కూడా కేబినేట్ ఆమోద ముద్ర వేయనుంది. దిశ ఘటన పరిణామాల గురించి కూడా కేబినేట్ భేటీలో కీలక చర్చ జరగనుందని తెలుస్తోంది. 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: