పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. బిల్లును వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.  ఈశాన్య రాష్ట్ర విద్యార్ధి సంఘాలు, రాజకీయ పక్షాల ర్యాలీలు, ఆందోళనలతో ఒక్కసారిగా పరిస్థితి వేడెక్కింది. 

 

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలు అట్టుడికిపోతున్నాయి. ప్రధానంగా చైనా, బంగ్లాదేశ్, మయన్మార్, భూటాన్లతో అంతర్జాతీయ సరిహద్దులను పంచుకుంటున్న అసోం, త్రిపురలలో ప్రజలు ఆందోళనలు బాట పట్టారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి పౌరసత్వం కల్పిస్తే తమ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందంటూ నిరసనలు చేపట్టారు. పెద్ద ఎత్తున జనం రోడ్లపైకి వచ్చి ప్లకార్డులతో నినాదాలు చేస్తున్నారు.

 


ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనల నేపథ్యంలో అస్సాం, త్రిపుర రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం అదనపు సైనిక బలగాలను మోహరించింది. అస్సాంలో రాష్ట్ర అసెంబ్లీలో ముందు పోలీసులతో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ హింస చెలరేగింది. జీఎస్ రోడ్డు వద్ద బ్యారికేడ్లు తొలగించడంతో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. టియర్ గ్యాస్ షెల్స్‌ ను కూడా ప్రయోగించారు. దిబ్రుగర్లో కూడా అల్లర్లు చెలరేగాయి.

 


గౌహతిలో బస్సులపై  ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. షాపులు, మార్కెట్లు మూతపడ్డాయి. బిల్లును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. రైళ్లు తిరగలేదు. అస్సాం ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన కళాకారులు  కూడా ఆందోళనలో పాల్గొన్నారు. మేఘాలయలో షాపులు, మార్కెట్లు, స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి.  గవర్నమెంట్ ఆఫీసులకు కేవలం 10 శాతం మంది మాత్రమే హాజరయ్యారు.  సమస్యాత్మక ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్ బలగాలను దింపారు. రాజధాని షిల్లాంగ్ లో ఆందోళనకారులు పోలీసుల వెహికల్ ను ధ్వంసం చేశారు. త్రిపుర ధాలై జిల్లాలోని మనుఘాట్ లో నాన్ ట్రైబల్స్ కు చెందిన మార్కెట్ కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ట్రైబల్ ప్రాంతాల్లో బంద్ ప్రభావం బాగా కనిపించింది. ధాలై, వెస్ట్ త్రిపుర, ఖోవై జిల్లాల్లో జనం బయటకు రాలేదు. గవర్నమెంట్ ఆఫీసులకు కూడా తక్కువ మంది హాజరయ్యారు. ట్రైన్ సర్వీసులు ఆగిపోయాయి. రోడ్ల మీద ఎలాంటి వాహనాలు తిరగలేదు.   

 

మరోపక్క జమ్మూకశ్మీర్ నుంచి పారామిలరీ బలగాలను ఉపసంహరించే ప్రక్రియను కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. కశ్మీర్ వ్యాలీలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి మెరుగుపడటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 10 కంపెనీల సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ను జమ్మూకశ్మీర్ నుంచి ఈశాన్య రాష్ట్రం అస్సాంకు తరలించారు. కశ్మీర్ నుంచి మరో 10కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలను కూడా అస్సాంకు తరలించనున్నట్టు సమాచారం. సెక్యూరిటీ సిబ్బంది అస్సాం చేరుకునేందుకు వీలుగా ఓ ప్రత్యేక రైలును కూడా ఏర్పాటు చేశారు. 

 

అయితే పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ స్పష్టం చేసింది. ఈశాన్య రాష్ట్ర ప్రజలపై వివాదాస్పదమైన చట్టాన్ని బలవంతంగా రుద్దుతున్నారని విద్యార్ధి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేస్తున్నాయి. 

 

లోక్ సభలో సుదీర్ఘ చర్చ తర్వాత పౌరసత్వ బిల్లు పాస్ అయ్యింది. మొత్తం 391 ఓట్లు పోలవగా, అందులో బిల్లుకు అనుకూలంగా 311 ఓట్లు, వ్యతిరేకంగా 80 ఓట్లు వచ్చాయి. ఒక్కో ఎమెండ్మెంట్ ప్రకారం ఓటింగ్ స్వీకరించిన స్పీకర్ బిల్లు ఆమోదం పొందినట్లు ప్రకటించారు. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పౌరసత్వ బిల్లును ఈశాన్య రాష్ట్రాలు ఒప్పుకునేది లేదంటున్నాయి. దీంతో వివిధ విద్యార్థి సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు వరుసగా రెండోరోజు ఆందోళనలు జరుగుతున్నాయి.  వివిధ రాజకీయ పార్టీలు కూడా విద్యార్థి సంఘాల బంద్ కు తమ మద్దతు తెలిపాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: