జేసీ బ్రదర్స్ బీజేపీలోకి వెళ్తారా? వైసీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచీ ఇదే టాక్. సోదరులు ఇద్దరూ ఒక వైపు తాము పార్టీ వీడబోమని చెబుతున్నా... అంతర్గతంగా కొందరు నేతలను కలవడం జరుగుతూనే ఉంది. కానీ ఈ సారి జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం అసలు విషయం తేల్చేశారు. కంచుకోట తాడిపత్రిలో మీటింగ్ పెట్టి మరీ రీసౌండ్ తో చెప్పారు. ఆయారాం గాయారాంలు పార్టీలోకి వస్తుంటారు.. పోతుంటారు.. తమకు అంత కర్మ పట్టలేదని..  స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామంటున్నారు. 

 


పార్టీ మార్పు పై ఆరు నెలలుగా సాగుతున్న చర్చకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు జేసీ బ్రదర్స్‌. సీఎం జగన్ కు నర్మగర్భ శత్రువులుగా ఉన్న జేసీ బ్రదర్స్ గత కొంత కాలంగా సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. ఎన్నికల్లో ఓటమి  రోజు నుంచి  పార్టీ మారబోతున్నారని టాక్ జోరుగా నడుస్తోంది. దీనికి తోడు తమకు బీజేపీ నేతలు టచ్ లో ఉన్నారని జేసీ దివాకర్ రెడ్డి చెబుతూ వచ్చారు. కానీ పార్టీ మారటం లేదనే చెప్పారు. అయితే ప్రభుత్వం మారాక బ్రదర్స్ కు కష్టకాలం మొదలైంది. దివాకర్ ట్రావెల్స్ బస్సులపై గత కొన్ని రోజులుగా దాడులు జరుగుతున్నాయి. సరైన ఆధారాలు లేవంటూ బస్సులు సీజ్ చేస్తున్నారు. దీంతో జేసీ ఆర్థిక మూలాలపై దెబ్బ పడింది. దీనిపై పోరాటం చేసేందుకు సిద్దమన్న దివాకర్ రెడ్డి ఆ తరువాత వెనక్కు తగ్గారు. ఇంతలో 2011లో కోర్టులో వేసిన త్రిశూల్ సిమెంట్స్ కేసు వెలుగులోకి వచ్చింది. కేవలం నెల రోజుల్లోనే నాలుగు వాయిదాలు పడటంతో పాటు నోటీసులు కూడా వచ్చాయి. ఇలా వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతుండటంతో ఇక జేసీ బ్రదర్స్ పార్టీ మారటం ఖాయమని అందరూ డిసైడ్ అయ్యారు. అయితే వీటన్నింటికీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి.


 
సహజంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండే జేసీ బ్రదర్స్  తాడిపత్రిలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభాకర్ రెడ్డితో పాటు జేసీ పవన్ కుమార్ రెడ్డి వచ్చారు.  ఓ విధంగా చెప్పాలంటే తమ బలం తగ్గలేదని చెప్పే ప్రయత్నం ఈ మీటింగ్ ద్వారా ప్రత్యర్థులకు తెలియజేశారు. తాము పార్టీని వీడటం లేదని... సొంత ప్రయోజనాల కోసమే ఆయారాం గాయారాంలు వస్తుంటారు... పోతుంటారని..  ఇక్కడే ఉంటామని తేల్చి చెప్పారు. అంతే కాదు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్ల నుంచి పోటీకి దిగుతామని ఎవరికీ భయపడే ప్రసక్తే లేదన్నారు ప్రభాకర్‌రెడ్డి. 

 

అయితే ఈ మీటింగ్ ద్వారా జేసీ ఫ్యామిలీ రెండు అంశాలను చెప్పాలనుకున్నారు. తాము పార్టీ మారటం లేదని... ఇక్కడే ఉంటామని చెప్పారు. ఇటీవల  దివాకర్ రెడ్డి ఢిల్లీలో ఎంపీ సుజనా, నడ్డాలతో డిన్నర్ మీటింగ్ లో కలిశారు. బీజేపీలోకి వెళ్లేందుకు అన్ని సిద్ధం చేసుకున్నారని కూడా ఢిల్లీ వర్గాలు చెప్పుకొచ్చాయి.  అయితే అనూహ్యంగా ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలా చెప్పడం బీజేపీ నేతలను కూడా ఒకింత షాక్ కు గురయ్యేలా చేసింది. మరోవైపు తాము రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటామని చెప్పిన జేసీ బ్రదర్స్.. ఇప్పుడు మళ్లీ యాక్టీవ్ అవడం కూడా చర్చకు దారి తీసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: