టీడీపీ అధినేత, ఏపీ విప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబుకు .. మే నెల నాటి మండుటెండ‌లో రాజ‌స్థాన్ ఎడారి లోని మంచి ఇసుక తిన్నెపై కుర్చీవేసి కూర్చోబెట్టి.. ఓ మైకు చేతిలో పెడితే చాలు.. చుక్క‌నీళ్లు కూడా అడ‌గ‌ర‌ని అంటున్నారు ఆయ‌న గురించి తెలిసిన టీడీపీ త‌మ్ముళ్లు!! ఇది నిజం. ఆయ‌న‌కున్న మైకు పిచ్చితో .. జ‌నాల‌కు పిచ్చి ప‌డుతున్న మాట నిజం. మైకు ముందుంటే చాలు.. మైక్ టైస‌న్ మాదిరిగా మాటలు కురిపించేయ‌డం ఆయ‌న‌కు మైకుతోపెట్టిన విద్య అంటున్నారు ప‌రిశీల‌కులు.

 

వేదిక ఏదైనా.. పొగ‌డ‌రా నీత‌ల్లి.. భూమిభార‌తిని అన్నారు రాయ‌ప్రోలువారు. అయితే, దీనినే కొంచెం అటు ఇటు మార్చి.. ఏవేదికెక్కినా.. మైకును వ‌ద‌లుకురా.. అంటున్నారు నారా వారు. సంద‌ర్భం ఏదైనా, స‌మ‌యం ఎంత త‌క్కువగా ఉంద‌ని చెప్పినా.. ఆయ‌న మైకు ముట్టుకుంటే.. మ‌రో ప్ర‌పంచంలోకి వెళ్లిపోతారు. మ‌న‌ల్ని ఈ ప్రపంచంలో ఎందుకు పుట్టామా? అని అనిపించేస్తారు. తాజాగా బుధ‌వారం అసెంబ్లీ జ‌రిగింది. స‌భ‌లో జ‌రిగిందంతా .. అన్ని చానెళ్లూ లైవ్ ప్ర‌సారాలు చేశాయి.

 

తిట్లు నుంచి పొగ‌డ్త‌ల వ‌ర‌కు, చ‌ర్చ‌ల నుంచి శాప‌నార్థాల వ‌ర‌కు అన్నింటినీ ప్ర‌జ‌లు వేయిక‌ళ్ల‌తో చూసి వేనోళ్ల చెప్పేసుకున్నారు. ఇక‌, ఏదైనా ఎంట‌ర్‌టైన్ మెంట్ ప్రోగ్రాం చూద్దాం అని ఐద‌య్యేస‌రికి చానెల్ పెడితే.. మ‌ళ్లీ బాబుగారు ప్ర‌త్య‌క్షం. మైక్‌టైస‌న్‌ను మించిపోయేలా మైక్‌ముందు కూర్చుని .. పాడిందే పాట‌రా.. అంటూ.. అసెంబ్లీ గేట్లు తీసిన ద‌గ్గ‌ర నుంచి మూసిన వ‌ర‌కు కూడా పూస‌గుచ్చ‌డం ప్రారంభించారు.

 

మాహ‌యాం.. అంటూ మొద‌లు పెట్టి.. వైఎస్ వ‌ర‌కు.. ఇప్పుడు అంటూ.. మ‌రో ఇర‌వై ఏళ్ల దాకా ఏక‌బిగిన ఆయ‌న ఉప‌న్యాసం దంచి కొట్టారు. దీంతో బాబుకు మైక్ మ్యానియా ఏమైనా ఉందా? అనే చ‌ర్చ సోష‌ల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఏదేమైనా.. చెప్పిందే చెప్ప‌డానికి ఆయ‌న ఓపిక ఉన్నా.. ప్ర‌జ‌ల‌కు మాత్రం వినిందే విన‌డానికి మాత్రం స‌మ‌యం లేదు మైక్ మిత్ర‌మా!! అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: