రైతు సమస్యలపై సమరశంఖం పూరిస్తున్నారు జనసేనాని. కాకినాడ వేదికగా రేపు దీక్షకు దిగుతున్నారు. అలాగే నేరుగా రైతులతో వారి సమస్యలపై చర్చించనున్నారు. అయితే ఇదంతా పొలిటికల్‌ స్టంటేనని ఆరోపిస్తోంది వైసీపీ. 


అన్ని విషయాల్లోనూ రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని...  ప్రభుత్వం వారి సంక్షేమంపై చిన్న చూపు చూస్తోందని ఆరోపిస్తున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్... కాకినాడ జె.ఎన్.టి.యు ఎదుట దీక్షకు దిగుతున్నారు. రాజమండ్రి ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా కాకినాడ వచ్చిన ఆయన... ఓ ప్రైవేట్‌ హోటల్లో ఉన్నారు. ఉదయం ఎనిమిది గంటలకు రైతు సౌభాగ్య దీక్ష చేపడతారు.

 

వ్యవసాయంలో సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోగా.. కనీస పెట్టుబడులు కూడా రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ... పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. మూడు రోజుల్లోగా రైతాంగ సమస్యలపై చర్చించాలని లేకుంటే 12వ తేదీన దీక్ష చేపడతానని ఇదివరకే ఆయన ప్రకటించారు. అందులో  భాగంగానే  జేఎన్టీయూ దగ్గర దీక్షకు దిగుతున్నారు. దీక్షకు హాజరైన రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలపై చర్చిస్తారు. 

 

ధాన్యం రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదనీ, కొనుగోలు కేంద్రాలు పనిచేయడం లేదని పవన్ ఆరోపించారు. దళారులతో కుమ్మక్కైన మిల్లర్లు..  బస్తాకు 100 నుండి 150 రూపాయిలు తగ్గించి ఇస్తున్నారన్న ఆరోపణలపైనా.. దీక్షలో పవన్‌ ప్రస్తావించనున్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే నగదు చెల్లించాలని, లాభసాటి  ధర నిర్ణయించాలన్నది జనసేన ప్రధాన డిమాండ్‌. 

 

మరోవైపు పవన్‌ దీక్షను వైసీపీ తప్పుపడుతోంది. రైతుల్నిప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటోందని... ఎన్నడూ లేని విధంగా వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అంటున్నారు.  అసలు పవన్‌ దీక్ష అంతరార్ధం ఏమిటో ప్రజలే తెలుసుకోవాలన్నది వారి మాట. మొత్తానికి పవన్ కళ్యాణ్ ప్రజాసమస్యలపై సమరశంఖం పూరిస్తారు. ఇటీవల టమోటా.. ఉల్లి సమస్యలపై గళమెత్తిన పవన్ ఇపుడు ఏకంగా దీక్షకు సిద్ధమవుతున్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడం.. ధాన్యం కొనుగోలుకు వెంటనే సొమ్ము చెల్లించడం లాంటి అంశాలపై పోరాటబాటపట్టారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: