జనసేన ఎమ్మెల్యే రాపాక ప్రసాదరావు , అధికార వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కి చేరువ అవుతున్నారా ? అంటే  రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానం విన్పిస్తోంది . ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓటమిపాలయినప్పటికీ , రాపాక ఒక్కరే ఆ పార్టీ తరుపున విజయం సాధించిన విషయం తెల్సిందే . అసెంబ్లీ లో జనసేన తరుపున ప్రాతినిధ్యం వహిస్తోన్న రాపాక, పార్టీ అధినేత పవన్ అభిప్రాయానికి భిన్నంగా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని అభినందించడం హాట్ టాఫిక్ గా మారింది .

 

మాజీ  ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేయాలనుకున్న నిర్ణయాన్ని , జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తుంటే అడ్డుకోవడం సరికాదని టీడీపీ కి హితవు పలకడం ద్వారా తన వైఖరి ఏమిటో రాపాక చెప్పకనే చెప్పారని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు . దానికితోడు జనసేనాని కి తనకు మధ్య గ్యాప్ ఉన్న మాట వాస్తవమేనని ఒక ఛానెల్ ప్రతినిధి కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో  రాపాక వెల్లడించడం  పరిశీలిస్తే , ఇక త్వరలోనే ఆయన  జనసేన కు  గుడ్ బై చెప్పనున్నారని తేలిపోయిందని అంటున్నారు . ఒక పార్టీ తరుపున గెల్చిన ఎమ్మెల్యేలు , మరొక పార్టీ లో చేరితే వారిపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి, స్పీకర్ కు ప్రపాదించిన విషయం తెల్సిందే .

 

అయితే తమకు మద్దతునిస్తోన్న  విపక్ష ఎమ్మెల్యేలను పార్టీ లో చేర్చుకోకుండా  , ఆయా పార్టీల వైఖరిపై దుమ్మెత్తిపోసే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యూహరచన చేసినట్లు , గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ వ్యవహారశైలిని పరిశీలిస్తే స్పష్టం అవుతుందని అంటున్నారు . ఇక ఇటీవల అధికార పార్టీ పై విమర్శల వర్షం కురిపిస్తోన్న పవన్ కు ఝలక్  ఇచ్చేందుకే రాపాక కు వైస్సార్ కాంగ్రెస్ వల వేసి ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు .   

మరింత సమాచారం తెలుసుకోండి: