మహిళలపై జరుగుతున్న దారుణ హత్యాచారాల తరుణంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక బిల్లు తీసుకొచ్చింది. దిశ ఘటన లాంటివి పునరావృతం కాకుండా కఠిన చట్టం తెస్తామని అసెంబ్లీలో ప్రకటించిన సీఎం జగన్.. క్యాబినెట్ లో బిల్లుకు ఆమోదం తెలిపారు. 

 

హైదరాబాద్ లో దిశ ఘటన తర్వాత కఠిన చట్టం తెస్తామని చెప్పిన ఏపీ ముఖ్యమంత్రి జగన్.. ఏపీ క్రిమినల్ లా కు సవరణ బిల్లు తీసుకొచ్చారు. ఈ బిల్లును కేబినెట్ ఆమోదించింది. ఏపీ దిశ యాక్ట్ పేరుతో చట్టం తీసుకొస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏపీ స్పెషల్ కోర్ట్ ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ ఎగెనెస్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్ యాక్ట్ కి కూడా మంత్రివర్గం అంగీకారం తెలిపింది. 


కొత్త బిల్లు ప్రకారం మహిళలపై అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష విధిస్తారు. చిన్నారులపై లైంగిక దాడి చేసినా మరణశిక్ష ఖాయం. నిర్థారించే ఆధారాలుంటే.. 21 రోజుల్లో తీర్పు చెప్పాలని బిల్లులో పొందుపరిచారు. వారం రోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి, 14 రోజుల్లో విచారణ జరగాలని పెట్టారు. మొత్తం 21 రోజుల్లో జడ్జిమెంట్ వచ్చేలా ఉండాలన్నారు. ప్రస్తుతం 4 నెలలు ఉన్న విచారణ సమయాన్ని 21 రోజులకు కుదిస్తూ బిల్లు తెచ్చారు. 

 

మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేయాలని బిల్లులో ఉంది. అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్ దాడులు, వేధింపులు, లైంగిక వేధింపులు, సోషల్ మీడియా ద్వారా వేధింపుల్లాలంటి నేరాల విచారణకు.. ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోషల్ మీడియాలో మహిళలను కించపరిచేలా, వారి గౌరవానికి భంగం కలిగించేలా పోస్టింగులు పెడితే కఠిన చర్యల్ని బిల్లులో పొందుపరిచారు. సోషల్ మీడియాలో మొదటి సారి తప్పు చేస్తే 2 సంవత్సరాలు, రెండోసారి తప్పుచేస్తే నాలుగేళ్లు జైలుశిక్ష ఉంటుంది. 

 

పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ 354 (ఎఫ్‌) కింద చర్యలుంటాయి. 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకూ శిక్ష పడుతుంది. నేరాల్లో తీవ్రత ఉంటే 14 ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకూ శిక్ష ఉంటుంది. పోక్సో చట్టం కింద ఇప్పటివరకూ 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకూ జైలుశిక్ష ఉంది. దీంతో శిక్షను పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: