దిశపై అఘాయిత్యానికి పాల్పడిన నలుగురు కీచకులని పోలీసులు ఎన్కౌంటర్ చేసి హతమార్చిన విషయం సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఎన్ హెచ్ఆర్సీ విచారణ చేపట్టిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై కేసులు నమోదు చేసే వరకూ వెళ్తోందట వ్యవహారం. అలాగే ఈ విషయంలో సైబరాబాద్ పోలిస్ కమిషనర్ సజ్జనార్ కూడా వివరణ ఇచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై మరింత కూలంకషమైన విచారణ చేపట్టనుందనట మానవ హక్కుల సంఘం. అందులో భాగంగా దిశ నిందితులను ఎన్కౌంటర్ చేయడాన్ని సమర్థించిన ప్రముఖులందరికీ నోటీసులు ఇవ్వనున్నారని సమాచారం. పొలీసులు తమ ఆత్మరక్షణకు వారిని హతమార్చినట్టుగా చెబుతున్నారు. అయితే జనాలు అలా భావించడం లేదు. దిశపై అఘాయిత్యానికి పాల్పడినందుకే వారిని పోలీసులు చంపారు అనే మాట జనాల నుంచి వినిపిస్తుంది.

 

పలువురు ప్రముఖులు కూడా అదే అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వారిని కాల్చి చంపడాన్ని వారు సమర్థించారు. పోలీసులపై ఎదురుతిరిగి దాడి చేసినందుకు వారిని చంపడాన్ని కాకుండా దిశపై అఘాయిత్యానికి పాల్పడినందుకు వారిని పోలీసులు చంపారన్నట్టుగా ప్రముఖులు కూడా మాట్లాడారు. వారిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, సినీ సెలబ్ర్టీస్ కూడా ఉన్నారు. బహిరంగ ఎన్కౌంటర్లను వాళ్లు అలా సమర్థించారు. ఈ నేపథ్యంలో వారందరి జాబితానూ తయారు చేస్తోందట హక్కుల సంఘం. ఎన్కౌంటర్లను పోలీసులు విధించిన శిక్షను ఎలా సమర్థిస్తారంటూ.. వారిని ప్రశ్నించనుందట హక్కుల సంఘం. ఈ నేపథ్యంలో ఎన్కౌంటర్ ను సమర్థించిన ప్రముఖులందరికీ నోటీసులు తప్పవని ఢిల్లీ వర్గాల సమాచారం.

 

అయితే ఈ ఎన్కౌంటర్లను ప్రముఖుల కన్నా సామాన్యులు గట్టిగా సమర్థించారు.  ఈ విషయంలో పోలీసులను యువతీయువకులు కూడా కీర్తించారు. మరి వారందరికీ కూడా మానవ హక్కుల సంఘం నోటీసులు ఇవ్వగలదా! నెటిజన్లు తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఇలా అడ్డుపడబట్టే అమ్మాయిలపై ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయని వాదిస్తున్నారు. ఇప్పుడు మైనర్లని అంటున్నారు. మరి అదే మైనర్లు ఒక ఆడ బిడ్డని అత్యంత కీచకంగా హింసించి హత్య చేశారు కదా...దానికి సమాధానం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: