అదేంటి చంద్రబాబునాయుడును ఏంటి స్పీకర్ తమ్మినేని సీతారాం కాపాడటమేంటి ? అని అనుకుంటున్నారా ?  అవును స్పీకర్ గనుక పెద్ద మనసు చేసుకుని ఉండకపోతే చంద్రబాబుకు తీవ్రమైన అవమానం జరిగుండేదనటంలో సందేహం లేదు.  స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశంపై అసెంబ్లీ చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా అధికార-ప్రతిపక్షాలు ఒకదానిపై మరొకటి ఆరోపణలు చేసుకుని విరుచుకుపడిన విషయం అందరికీ తెలిసిందే.

 

అయితే చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన వ్యవహారాలపై జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతు ఆరోపణలు చేశారు. దాంతో సభలో వాతావరణం ఒక్కసారిగా హీటెక్కిపోయింది. తనపై జగన్ చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ చంద్రబాబు పట్టుబట్టారు. స్పీకర్ అవకాశం ఇవ్వకపోవటంతో స్పీకర్ ను నోటికొచ్చినట్లు మాట్లాడారు.

 

స్పీకర్ ను బెదిరిస్తు మాట్లాడటం, నోటికొచ్చిన వ్యాఖ్యలు చేయటం చంద్రబాబుకు అలవాటుగా మారిపోయింది. అదే పద్దతిలో ఇపుడు కూడా అలాగే నోరు పారేసుకున్నారు. దాంతో సభలో తీవ్ర గందరగోళం జరిగింది. వైసిపి సభ్యులు స్పీకర్ కు చంద్రబాబు క్షమాపణ చెబితే కానీ సమావేశాలు జరక్కూడదంటూ పట్టుబట్టారు.

 

స్పీకర్ నే కాకుండా స్పీకర్ స్ధానాన్ని కూడా  అవమానించిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలని లేకపోతే సస్పెండ్ అన్నా చేయాలంటూ పెద్ద ఎత్తున వైసిపి సభ్యులు పట్టుబట్టారు. ఇదే విషయమై సభలో సుమారుగా పదిహేను నిముషాలు గొడవ జరిగింది.

 

తర్వాత స్పీకర్ మాట్లాడుతూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను రికార్డులనుండి తొలగిస్తున్నట్లు చెప్పారు. అలాగే భవిష్యత్తులో స్పీకర్ స్ధానంపై  ఇటువంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చంద్రబాబును హెచ్చరించారు.

 

జరిగిన విషయాన్ని మరిచిపోదామని చెప్పిన స్పీకర్ చంద్రబాబును క్షమాపణ చెప్పమని కూడా అడగలేదు. సభ్యులు పట్టుబట్టినట్లే స్పీకర్ కూడా చంద్రబాబును క్షమాపణ చెప్పాలని అడిగుంటే చంద్రబాబుకు చాలా అవమానంగా ఉండేది. వైసిపి సభ్యులు క్షమాపణ చెప్పాలని లేదా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసినంతసేపు చంద్రబాబు మొహంలో టెన్షన్  కొట్టొచ్చినట్లు కనబడింది.

 

నిండు సభలో క్షమాపణ చెప్పుకున్నా లేకపోతే సస్పెండ్ అయినా చంద్రబాబుకు అవమానమే అనటంలో సందేహం లేదు. గతంలో రోజాను ఏడాది పాటు అప్పటి స్పీకర్ సస్పెండ్ చేసినట్లే ఇపుడు స్పీకర్ కూడా ఏడాదిపాటు చంద్రబాబును సస్పెండ్ చేస్తే అడ్డుకునే దిక్కు కూడా లేదు. అయినా స్పీకర్ అలా చేయకుండా విషయాన్ని ఇక్కడితో వదిలేసి సభా కార్యక్రమాలను కంటిన్యు చేద్దామని అనటంతో చంద్రబాబు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: