అందరూ ఆయన స్కూల్ నుంచి వచ్చినవాళ్లే. ఆయన దగ్గర పాఠాలు నేర్చుకున్నవాళ్లే. కాకపోతే  ఆ రోజులు పోయాయి. ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. వాళ్లే ఆయన్ని రౌండప్ చేస్తున్నారు. దుమ్మెత్తిపోస్తున్నారు. ఇరుకున పెడుతున్నారు. ఇలాంటి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది చంద్రబాబునాయుడికే. ఏపీ అసెంబ్లీలో నిత్యం కనిపిస్తున్న సీన్ ఇది. 


ఒకప్పుడు టీడీపీ అమ్ములపొదిలో అస్త్రాలు. చంద్రబాబుపై ఈగవాలకుండా, బాబుగారిపై చిన్నమాట పడకుండా కాపాడిన సైన్యం. గడచిన 15ఏళ్లలో రకరకాల కారణాలతో పార్టీలు మారి చివరికి వైసీపీ చేరుకుని ఇప్పుడు అసెంబ్లీలో చంద్రబాబుకి చెప్పుకింద రాయిలా మారారు. ప్రస్తుతం టీడీపీ నుంచి విడిపోయి ప్రత్యేక ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన వల్లభనేని వంశీ..బాబుతో డైరెక్ట్ వార్ కే దిగారు. వంశీ మాట్లాడినప్పుడు చంద్రబాబు సభ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. 

 

ఇక గుడివాడ ఎమ్మెల్యే నాని. వైసీపీ ముఖ్యనాయకుల్లో ఒకడైన నాని బాబుతో విభేదించి వైసీపీ తొలిరోజుల్లోనే ఆ పార్టీలో చేరారు. సభ బయట చంద్రబాబుని నోటికొచ్చినట్టు తిట్టిపోసే నాని, సభలో కూడా ఏ మాత్రం తగ్గటం లేదు. ఏకవచన ప్రయోగంతో బాబుని దుమ్మెత్తిపోస్తున్నారు. 
ఇక ఫైర్ బ్రాండ్ రోజా. టీడీపీలో పుట్టి వైసీపీలో చేరిన నేత. వైసీపీలోనే రెండుసార్లు ఎమ్మెల్యే. సభలో టార్గెట్ బాబు, టార్గెట్ లోకేష్ గానే ఉంటాయి ఈమె ప్రసంగాలు. తండ్రీ కొడుకుల ఇద్దర్నీ మాటలతో చెడుగుడు ఆడుతున్నారు రోజా..

 

గడచిన ఐదేళ్లు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న అవంతి శ్రీనివాస్ ఇప్పుడు వైసీపీ సర్కారు మంత్రి. చంద్రబాబుని, టిడిపిని తిట్టిపోయాలంటే అవంతి తర్వాతే ఎవరైనా.. విడదల రజని లాంటి నేతలు కూడా టీడీపీ అధినేతను వదిలిపెట్టడం లేదు. వైసీపీ అధిష్టానాన్ని సంతృప్తిపరచడానికో, సభలో సత్తా నిరూపించుకోటానికో, రజనిలాంటి మొదటిసారి ఎమ్మెల్యేలు కూడా మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇక టీడీపీ నుంచి వచ్చిన ఆనం రామనారాయణ రెడ్డి లాంటి సీనియర్ నేతలు కూడా వీలున్నపుడల్లా చంద్రబాబుకి చురకలు వేస్తున్నారు, మరీ యువనేతలంత దూకుడుగా కాకపోయినా చంద్రబాబుకి పంచ్ లేస్తూనే ఉన్నారు.

 

రెండున్నదశాబ్దాలకు పైగా టీడీపీలో ఉండి, మంత్రిగా కూడా పనిచేసిన ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాం...తో కూడా చంద్రబాబు చురకలు వేయించుకోవాల్సి వస్తోంది. చంద్రబాబుని కంట్రోల్ చేయటంలో స్పీకర్ ఏమాత్రం తగ్గటం లేదు.  అసెంబ్లీ లాబీల్లో ఇప్పుడు ఇదే చర్చ జరగుతోంది. రాజకీయాలు, రోజులు ఒకేలా ఉండవని అంటున్నారు నేతలు. చంద్రబాబు మాత్రం సభలో ఉన్నంతసేపు చిద్విలాసంగా ధీమాగా ఉన్నట్టు కనిపించటానికి ప్రయత్నిస్తున్నారు. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: