అధిక వర్షాలు కురిసినా సీమ ప్రాజెక్టులు ఎందుకు నింపలేదని ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం నిలదీసింది. మంత్రులు బాధ్యత తీసుకోకుండా.. చంద్రబాబు ఇల్లు ముంచడానికి ప్లాన్లు గీశారని ఆరోపించింది. అయితే చంద్రబాబు నిర్వాకం కారణంగానే సీమ ప్రాజెక్టులు నింపలేకపోయామని అధికారపక్షం కౌంటరిచ్చింది. 

 

ఎప్పుడూ లేని విధంగా భారీ వర్షాలు కురిసినా.. రాయలసీమ ప్రాజెక్టులు ఎందుకు నింపలేదని టీడీపీ అసెంబ్లీలో నిలదీసింది. ప్రభుత్వ అసమర్థత కారణంగానే ప్రాజెక్టులు నిండలేదని ఆరోపించింది. గండికోట గురించి ప్రతిపక్ష నేతగా గొప్పలు చెప్పిన జగన్.. ఇప్పుడేం చేశారని ప్రశ్నించింది తెలుగుదేశం. 


గండికోట గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదన్నారు ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి. గండికోట ప్రాజెక్టు సామర్థ్యం పెంచే పని చేసింది వైఎస్ అయితే.. చంద్రబాబు కేవలం ఓపెనింగ్ చేసి అంతా తానే చేశానని చెప్పుకున్నారని సెటైర్లేశారు.


ఓవైపు భారీ వర్షాలు కురుస్తుంటే మంత్రులు ప్రాజెక్టులపై పర్యవేక్షణ చేయలేదని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తప్పుబట్టారు. సీఎం విదేశాల్లో ఉన్న సమయంలో ఇరిగేషన్ మంత్రి బాధ్యత తీసుకోవాలి కానీ చంద్రబాబు ఇల్లు ముంచడానికే ప్లాన్లు గీశారని ఆరోపించారు. గతంలో వైఎస్ మిగులుజలాలు అవసరం లేదని అఫిడవిట్ కూడా ఇచ్చారని గుర్తుచేశారు.

 

అచ్చెన్న వ్యాఖ్యల్ని తప్పుబట్టారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. వైఎస్ ఏ పరిస్థితుల్లో అఫిడవిట్ ఇచ్చారో చెప్పకుండా.. వాస్తవాలు వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. రాయలసీమ ప్రాజెక్టుల కోసం శ్రద్ధ తీసుకుంది వైఎస్ మాత్రమే అన్నారు.  


చంద్రబాబు గత ఐదేళ్లూ సీఎంగా బాధ్యతగా పనిచేసి ఉంటే.. ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు జగన్. ప్రాజెక్టు కాల్వల సామర్థ్యం పెంచకుండా నీటిని ఎలా స్టోర్ చేస్తామని ప్రశ్నించారు జగన్. వచ్చే జూన్ నాటికి ప్రాజెక్టుల నిండా నీళ్లు నింపే బాధ్యత తీసుకుంటామన్నారు. రాయలసీమ ఛాంపియన్ లము  మేమే అని చెప్పుకోవడానికి అధికార, ప్రతిపక్షాలు పోటీపడ్డాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: