పౌరసత్వ సవరణ బిల్లు-2019ను బుధవారం మధ్యాహ్నం అమిత్ షా రాజ్య సభలో ప్రవేశపెట్టగా రాత్రి 8 గంటల వరకు వాడీ వేడి చర్చ జరిగింది. ఈ బిల్లుకు సోమవారం రాత్రి లోక్ సభలో 334-106 ఓట్ల తేడాతో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. పౌరసత్వ బిల్లుపై విపక్షాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలకు అమిత్ షా సమాధానాలు ఇచ్చారు. 

 

అప్ఘానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లకు చెందిన ముస్లిమేతర శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించడం కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు తరహాలోనే ఈ బిల్లు కూడా ముస్లింలకు వ్యతిరేకం కాదని అమిత్ షా తెలిపారు. పౌరసత్వ బిల్లు గురించి భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. పాకిస్థాన్‌ లో ముస్లింలు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని హోం మంత్రి తెలిపారు. పాకిస్థాన్, అప్ఘానిస్థాన్‌, బంగ్లాదేశ్‌లలో ముస్లింలు మైనార్టీలు కాదు కాబట్టి వారిని దీని పరిధిలోకి తేవాల్సిన అవసరం లేదన్నారు. 

 

రోహింగ్యాలు మయన్మార్‌లోకి శరణార్థులుగా వచ్చి.. అక్కడి నుంచి భారత్‌కు అక్రమంగా వలస వచ్చారని.. అందుకే వారిని ఈ బిల్లు పరిధిలోకి తీసుకురాలేదన్నారు. దేశ విభజనకు జిన్నా డిమాండే కారణమని అందరికీ తెలుసన్న అమిత్ షా.. మత ప్రాతిపదికన దేశాన్ని విడగొట్టడానికి కాంగ్రెస్ ఎందుకు అంగీకరించిందని ప్రశ్నించారు.

 

పౌరసత్వ సవరణ బిల్లులో శ్రీలంక తమిళులను ఎందుకు చేర్చలేదనే విషయమై ఎంపీ సుబ్రమణ్య స్వామి వివరణ ఇచ్చారు. మత ప్రతిపాదిక శరణార్థులుగా వారు భారత్ రాలేదని, పూర్తి స్థాయి యుద్ధం కారణంగా వారు మన దేశానికి వచ్చారన్న ఆయన.. తిరిగి వెనక్కి వెళ్లిపోవడంతో ఇక్కడ వాళ్ల జనాభా తగ్గిందన్నారు. సామూహిక హత్యాకాండ అనేది ఎల్టీటీఈ ప్రచారమని ఆయన తెలిపారు. 8-9 లక్షల మంది శ్రీలంక తమిళులకు గతంలో భారత పౌరసత్వం ఇచ్చామని అమిత్ షా తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: