పౌరసత్వ సవరణ బిల్లు ఉభయ సభల ఆమోదం పొందిందో … లేదో అప్పుడే ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు మిన్నంటాయి . అసోం , త్రిపుర లో ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి  . స్థానికులు రోడ్లపైకి వచ్చి విధ్వంసకాండ కు దిగే ప్రయత్నం చేయడంతో కేంద్రం సాయుధ బలగాలను మోహరించింది . ఇంటర్ నెట్ సేవలను నిలిపివేసింది . అయినా  కూడా పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్న వారు  రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపే ప్రయత్నాన్ని చేస్తున్నారు . అసోం , త్రిపుర లో మాత్రమే ఈ ఆందోళనలు కొనసాగుతుండగా , అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్ , మణిపూర్ రాష్ట్రాల్లో పరిస్థితి ప్రశాంతంగా ఉంది .

 

 అసోం , త్రిపురలోనే ఆందోళనలు మిన్నంటడానికి పలు కారణాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేస్తున్నారు . అరుణాచల్ ప్రదేశ్ తో సహా మిజోరాం , నాగాలాండ్ , మణిపూర్ రాష్ట్రాల్లో స్థిరపడాలంటే ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకోవాలని దాంతో బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్ , పాకిస్థాన్ నుంచి వచ్చి భారత్ లో స్థిరపడాలనుకునే మైనార్టీలు , ఆయా రాష్ట్రాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే అవకాశాలు లేవని అంటున్నారు . ఇకపోతే అసోం , త్రిపుర లో ఇప్పటికే ఇతర రాష్ట్రాల వారి సంఖ్య పెరిగి,  స్థానికులు మైనారిటీలుగా మారారని , ఇక పౌరసత్వ సవరణ బిల్లు తో బంగ్లాదేశ్ , ఆప్ఘనిస్థాన్ , పాకిస్థాన్ నుంచి వచ్చి భారత్ లో స్థిరపడాలనుకునే మైనార్టీలు ఈ రెండు రాష్ట్రాల్లోనే ఎక్కువగా స్థిరపడే అవకాశాలున్నాయని స్థానికులు భావిస్తున్నారు .

 

 ఈ బిల్లు ఉభయ సభల ఆమోదం పొందిన నేపధ్యం లో స్థానికులు ఆందోళనతో రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారని అంటున్నారు . అయితే  పౌరసత్వ సవరణ  బిల్లు ద్వారా త్రిపుర , అసోం రాష్ట్రాల ప్రజలకు వచ్చిన ప్రమాదమేమీ లేదని బీజేపీ నేతలు అంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: