ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతాయంటే ఇదేనేమో!, ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు పరిస్థితి చూస్తుంటే ఈ సామెత నిజమేననిపిస్తోంది. ఒకప్పుడు చంద్రబాబు స్కూల్ లో పాఠాలు నేర్చుకున్న ఎమ్యెల్యేలే ఇప్పుడు బాబుకు అసెంబ్లీలో పాఠాలు నేర్పుతున్నారు. టీడీపీ పార్టీ నుంచి వైదొలిగిన ఐదుగురు ఎమ్యెల్యేలు చంద్రబాబును అసెంబ్లీలో చెడుగుడు ఆడేసుకుంటున్నారు.

 

ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరిస్తున్న తమ్మినేని సీతారాం దాదాపు రెండున్నర దశాబ్దాలకు పైగా టీడీపీలో పని చేశారు. ఇప్పుడు వైసీపీ పార్టీలో ఎమ్యెల్యేగా గెలిచి ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరిస్తూ బాబు గారికి సభా సాంప్రదాయాల గురించి పాఠాలు చెప్తున్నారు, తమ్మినేని సీతారాం చంద్రబాబు పట్ల వ్యవహరిస్తున్న తీరుపై అసెంబ్లీ లాబీలో చర్చ జరుగుతోంది అంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ మధ్యనే చంద్రబాబుకి హ్యాండ్ ఇచ్చిన గన్నవరం ఎమ్యెల్యే వల్లభనేని వంశీ కూడా అసెంబ్లీలో చంద్రబాబుని తీవ్రంగా విమర్శిస్తున్నారు, వంశీ మాట్లాడుతుంటే చంద్రబాబు ఏకంగా అసెంబ్లీలో నుంచి బయటకి వెళ్లిపోయారు. 

 

ఇక మంత్రి కొడాలి నాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో టీడీపీ పార్టీలో పని చేసిన నాని ఇప్పుడు వైఎస్ జగన్ క్యాబినెట్లో సివిల్ సప్లైస్ మినిస్టర్. వీలు చిక్కినప్పుడల్లా చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు కొడాలి నాని. వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా ప్రస్తుతం నగరి ఎమ్యెల్యేగా ఉన్నారు. చంద్రబాబుని విమర్శించాలంటే రోజా తరువాతే, ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీలో బాబు గారి పుత్రరత్నం లోకేష్ పై విమర్శలు చేశారు రోజా "చంద్రబాబు గారు తన కుమారుడిని అమెరికా పంపించి గొప్పగా చదివించానని చెప్తున్నారు, లోకేష్ కి మాత్రం కనీసం జయంతి, వర్ధంతి మధ్య తేడా కూడా తెలియదు, చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమో దేశమో కూడా తెలీదు" అంటూ ఎద్దెవా చేశారు. 

 

గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బాబు గారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో రోజాను చాలా కాలం పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. ప్రస్తుత ఏపీ క్యాబినెట్లో మంత్రి అయిన అవంతి శ్రీనివాస్ కూడా గతంలో టీడీపీలో పని చేశారు. ఇప్పుడు అవంతి శ్రీనివాస్ చేత చంద్రబాబు పాఠాలు చెప్పించుకునే పరిస్థితి. అసెంబ్లీలో ఈ ఐదుగురు ఎమ్యెల్యేలు చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నప్పుడల్లా అయ్యో చంద్రబాబు గారు అని టీడీపీ శ్రేణులు అని భాధ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: