వ్యవస్దలో మార్పు రావాలంటే ముందుగా ప్రజల్లో మార్పు రావాలి. అప్పుడే వ్యవస్ద బాగుపడుతుంది. స్టేజీ ఎక్కి ఎదుటి వారు పొగడ్తల్లో ముంచెత్తేలా నరం లేని నాలుక నాలుగు మాటలు చెబితే చూసిన వారు వీరు ఇంత నిజాయితీగా మాట్లాడుతున్నారు ఎంతటి నీతివంతులో అని అనుకుంటారు. కాని ఒక సామేత ఉందండి చెప్పేది శ్రీరంగ నీతులు. చొచ్చేది మాత్రం దొమ్మరి గుడిసెలు అని. దేశంలో మంచి మాటలు చెప్పే ప్రతి వారు నీతివంతులైతే దేశానికి పట్టిన దరిద్రం ఎప్పుడో వదిలేది.

 

 

ఇకపోతే అవినీతి నీడలో ఆనందంగా బ్రతుకుతున్న లంచం ఇప్పటి వరకు ఎందరి ప్రాణాలు తీసిందో మనందరికి తెలిసిందే. ఇప్పుడు అవినితి అనే మాటకు తావు లేకుండా నీతిగా బ్రతుకు అనే మాటలు చెప్పకుండా చేసి చూపించారు ఓ కలెక్టర్ గారు. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారడమే కాదు. నిజాయితీ పరులు ఇంకా అక్కడక్కడ ఉన్నారని నిరూపించింది కూడా.. వివరాలు తెలుసుకుంటే తాండ్రాల నర్సయ్య అనే ఇతను జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన రైతు..తన 4 గుంటల భూమికి సంబంధించిన పట్టాదారు పాసు బుక్కు ఇవ్వండి అంటూ అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగాడు. అధికారులు మాత్రం పట్టాదారు పాసుబుక్ ఇవ్వలేదు. లంచం ఇస్తేనే పని అవుతుందని తేల్చి చెప్పారు.

 

 

దీంతో వీఆర్ఏ మహేశ్, రమేశ్‌కు రూ.10 వేలు లంచం కూడా ఇచ్చాడు. లంచం తీసుకున్న తర్వాత కూడా వారు రైతు పని చేయలేదు. దీంతో విసిగి పోయిన రైతు నర్సయ్య. తన సమస్య గురించి ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. వెను వెంటనే స్పందించిన జిల్లా కలెక్టరు డాక్టర్ శరత్ విచారణ జరిపించి వీఆర్ఏ మహేశ్, రమేశ్‌ను విధుల నుంచి తొలగించడమే కాకుండా  రైతు నుంచి వారు వసూలు చేసిన డబ్బులు కూడ తిరిగి ఇప్పించడంతో పాటుగా పట్టాదారు పాసు బుక్కు పేపర్లు ఇప్పించారు. చూసారా ఇలాంటి వారు కనీసం జిల్లాకు ఒక్కరున్న పేదప్రజలు హయిగా బ్రతుకుతారు. రైతులు ఆనందంగా జీవిస్తారు..అని అనుకుంటున్నారు ఈ సంఘటన విన్నవారు..

మరింత సమాచారం తెలుసుకోండి: