మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తాను ఏం మాట్లాడినా అందులో వాస్తవికత, వెటకారం, సంచలనం ఉంటూ ఉంటాయి. నిజాన్ని నిర్భయంగా చెప్పడంలోనూ, అభిప్రాయం వ్యక్తం చేయడంలోనూ ముక్కుసూటితనం ఆయన నైజం. ప్రస్తుత రాజకీయాలపై, రాష్ట్ర పరిస్థితులపై, రామ్ గోపాల్ వర్మ సినిమా అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాపై ఆయన అభిప్రాయాన్ని అంతే ముక్కుసూటిగా చెప్పారు.

 

 

వర్మ ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాపై మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి తనదైన స్టయిల్లో సెటైర్ వేశారు. రాంగోపాల్‌ వర్మకు ఈ సినిమాకు పేరు తప్పుగా పెట్టాడని అన్నారు. బహుశా ఆయనకు టైటిల్ పెట్టడం తెలియదనుకుంటా అని అన్నారు. ఆ సినిమాకు ‘రెడ్డి రాజ్యంలో కక్ష రాజ్యం’ అని పేరు పెట్టుంటే బాగుండేదని తన అభిప్రాయాన్ని తెలిపారు. బుధవారం నాడు అమరావతిలో మీడియాతో సరదాగా ఆయన మాట్లాడారు. జగన్ పాలనపై మాట్లాడుతూ.. వైఎస్ పాలన కొడుకులా జరిగితే.. జగన్ హయాంలో తాత రాజారెడ్డి మార్క్‌ పాలన కనిపిస్తోందని తనదైన శైలిలో విమర్శలు చేశారు. చంద్రబాబు హయాంలో కమ్మవాళ్లు కృష్ణా, గోదావరిలో కలిసిపోయారని అన్నారు. నామినేటెడ్‌ పోస్టులు రెడ్లకు ఇవ్వడం గొప్ప విషయం అని ఇందుకు జగన్‌ను తాను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని అన్నారు. జగన్‌ గట్స్‌ను మెచ్చుకోవాల్సిందే అన్నారు.

 

 

చంద్రబాబుకు మాత్రం ఆ ధైర్యం లేదని విమర్శించారు. అసెంబ్లీలో రాయలసీమ ప్రాజక్టులపై జగన్ బాగా మాట్లాడారని మంచి పరిణితి చూపారని అన్నారు. జగన్ ఆశయం బాగానే ఉన్నా.. ఆచరణ సాధ్యమేనా అని సందేహం వెలిబుచ్చారు. డబ్బులు లేవు అంటూ రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని గుర్తు చేశారు. నెల్లూరులో మాఫియా రాజ్యమేలుతోందని ఆనం రాంనారాయణ రెడ్డి అనకుండా ఉండాల్సిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ మాఫియా లేదో చెప్పమనండంటూ జేసీ ఎదురు ప్రశ్న వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: