హైదరాబాద్ లో సిటి బస్సులను తగ్గించేందుకు రంగం సిద్ధం అయ్యింది . గురువారం నుంచి శనివారం వరకు మూడు రోజుల్లో 1000 బస్సులను తగ్గించాలని అధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ రీజియన్ లో 550 బస్సులు, సికింద్రాబాద్ రీజియన్ లో 450 బస్సులు తగ్గించాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకే సారి ఇన్ని బస్సులు తగ్గించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడతారని సిబ్బంది అధికారులకు తెలిపారు. కానీ సీఎం ఆదేశాలు కాబట్టి అమలు చేయాల్సిందేనని వారన్నట్టు తెలుస్తోంది. 

 

ప్రస్తుతం బస్సు ఛార్జీలు పెంచినందున బస్సులు తిరిగినా నష్టం ఉండదని, అధిక ఆదాయం తేవచ్చని సిబ్బంది అభిప్రాయం తెలియచేస్తున్నారు. ఒకే సారి 1000 బస్సులు తగ్గిస్తే హైదరాబాద్ లో ఉన్నా మారుమూల ప్రాంతాల్లో ఉన్నట్టు బస్సుల కోసం వేచి చూడాల్సి వస్తుందని పలువురు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఛార్జీలు పెంచినప్పుడు రవాణా సేవలు అందించాలి కదా అని వారు ప్రశ్నిస్తున్నారు. 

 

తగ్గించిన 1000 బస్సులను సరుకు రవాణాకు ఉపయోగిస్తారని సమాచారం.  ప్రస్తుతం 1000 బస్సులను తగ్గిస్తే దాదాపు 4 వేల మంది సిబ్బంది ఖాళీగా ఉండాల్సి వస్తుంది. వారు ఖాళీగా ఉన్నా జీతాలు చెల్లించాల్సిందే. అయితే ఇందులో ఉన్న 2 వేల మంది డ్రైవర్లను పోలీసు శాఖ, అగ్నిమాపక శాఖల్లో ఖాళీగా ఉన్న డ్రైవర్ పోస్టులలో నియమిస్తారని తెలుస్తోంది. కొంత మందిని ఆర్టీసి నిర్వహించే పెట్రోల్ బంకుల్లో, సరుకు రవాణా విభాగాల్లో నియమిస్తారని సమాచారం. 

 

 ప్రస్తుతం ఇన్ని బస్సులు ఉంటేనే ఉదయం, సాయంత్రం వేళల్లో వేలాడుతూ ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. అటువంటిది ఇప్పుడు 1000 బస్సులు తగ్గిస్తే గ్రామాలకంటే అధ్వానంగా హైదరాబాద్ లో బస్సు ప్రయాణం తయారవుతుందని పలువురు ఆవేదన వ్యక్తం తెలియయచేస్తున్నారు. ప్రస్తుతం ఛార్జీలు పెంచినందున సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం పై పునరాలోచించాలని వారు కోరడం జరిగింది. బస్సుల సంఖ్యను యధావిధిగా ఉంచాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: