ఏపీ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభం అయ్యాయి. స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలతో సమావేశాలను ప్రారంభించారు. సమావేశాల్లో పాల్గొనడానికి చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు ప్లకార్డులతో అసెంబ్లీ లోపలికి రావడానికి ప్రయత్నించగా అసెంబ్లీ సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ 2430 జీవో రద్దుపై చంద్రబాబు తీరు ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు. 
 
చంద్రబాబు జీవోను పూర్తిగా చదివారా..? ఇంగ్లీష్ ను అర్థం చేసుకోవడంలో లోపం ఉందా...? అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు జగన్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ మేము 2430 జీవో రద్దు చేయాలని కోరుతున్నామని అన్నారు. ముఖ్యమంత్రిగారు పదే పదే చులకన చేసి మాట్లాడుతున్నారని నేను వేంకటేశ్వర యూనివర్సిటీలో ఎం.ఏ చేశానని అన్నారు. సీఎం జగన్ ఎక్కడ చదివారో చెబితే మేము కూడా నేర్చుకుంటామని చంద్రబాబు అన్నారు. 
 
కావాలని చులకనగా మాట్లాడటం ముఖ్యమంత్రి స్థాయికి తగదని చంద్రబాబు అన్నారు. తనకు ఇంగ్లీష్ అర్థం రాదని జగన్ ఇంగ్లీష్ లో పుట్టాడని చంద్రబాబు అన్నారు. దేశంలో ఉండే మీడియా అంతా ఈ జీవోను రద్దు చేయాలని కోరుతున్నారని అన్నారు. హిందూకు, టైమ్స్ ఆఫ్ ఇండియాకు జగన్ ఇంగ్లీష్ నేర్పించారని చంద్రబాబు అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి 938 జీవోను తీసుకొచ్చారని చంద్రబాబు చెప్పారు. 
 
కానీ వ్యతిరేకత రావటంతో ఆ జీవోను వెనక్కు తీసుకున్నారని అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి పత్రికా స్వేచ్చను కాపాడటానికి చర్యలు చేపడితే జగన్ పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారని చంద్రబాబు అన్నారు. పేపర్లు పట్టుకొని వస్తుంటే మార్షల్స్ అడ్డుకున్నారని మనిషిని పట్టుకొని తోస్తున్నారని అన్నారు. జీవో పేరుతో మీడియాను బెదిరించడం సరికాదని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. మార్షల్స్ ప్లకార్డులు, బ్యానర్లు, నల్ల రిబ్బన్లు వద్దంటున్నారని చివరకు కాగితాలను కూడా తీసుకెళ్లనీయటం లేదని అన్నారు. అసెంబ్లీలో పులివెందుల పంచాయతీ చేస్తామంటే కుదరదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: