ఏపీ అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఈరోజు అసెంబ్లీలో ప్రభుత్వ బళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది, ఈ చర్చ సందర్భంగా సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య మాటల తూటాలు పేలాయి. "అప్పట్లో మేము ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు, తెలుగు భాషను అవమానిస్తున్నారని మీరు అన్నారు. ప్రభుత్వ బళ్లను నిర్వీర్యం చెయ్యడానికే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు అని మమల్ని ఈ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు" అని చంద్రబాబు పేర్కొన్నారు.

 

దీనిపై స్పందించిన సీఎం "మీరు అధికారంలో ఐదు సంవత్సరాలు ఉన్నారు, మీరు అనుకుని ఉంటే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టలేరా, మేము అన్నామని వదిలేస్తారా?, మీ హయాంలో కేవలం 35 శాతం బళ్ళల్లో మాత్రమే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు, మేము పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతుంటే ఎందుకు విమర్శలు చేస్తున్నారు" అని అన్నారు.

 

జగన్ సమాధానంపై స్పందించిన చంద్రబాబు "మీ మానస పుత్రిక సాక్షి ఏం రాసింది, ఇంగ్లీష్ మీడియంతో ప్రభుత్వ బళ్ళు నిర్వీర్యం, ఇప్పటికిప్పుడు ఇంగ్లీష్ మీడియం అవసరం ఎందుకు వచ్చింది" అంటూ సాక్షిలో వచ్చిన కథనం గురించి చెప్పారు. చంద్రబాబుపై తీవ్రంగా స్పందించిన సీఎం జగన్ "వయసు పెరగ్గానే సరిపోదు బుద్ధి జ్ఞానం ఉండాలి, సాక్షి లో కథనం వస్తే అది జగన్ చెప్పినట్లు అవుతుందా?, ఊరికే ఏదో మాట్లాడాలి కాబట్టి ఏదో మాట్లాడొద్దు" అంటూ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

జగన్ మాటలకు స్పందించిన చంద్రబాబు "నాకు బుద్ధి జ్ఞానం లేదు అని అంటున్నారు మీ సాక్షి పేపర్ కు లేదు బుద్ధి జ్ఞానం అదొక చెత్త పేపర్" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యలో కలుగజేసుకున్న ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి చర్చ తప్పు దారి పడుతోందని అప్పుడెప్పుడో వచ్చిన కథనాలపై ఇప్పుడు చర్చ ఎందుకు, మీరు ఈ అంశంపై ప్రభుత్వానికి ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, దయ చేసి చర్చను తప్పు దారి పట్టించొద్దు అంటూ చంద్రబాబును కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: