ఈశాన్య రాష్ట్రమైన అసోంలో పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా భారీ స్థాయిలో నిరసన జ్వాలలు వ్యక్తమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ నిరసన జ్వాలలు రేగిన నేపథ్యంలో పౌరసత్వ సవరణ బిల్లు గురించి స్పందించారు. పౌరసత్వ సవరణ బిల్లు గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మోదీ చెప్పారు. మీ హక్కులను ఎవరూ హరించలేరని మోదీ అన్నారు. అసోం ప్రజలకు సోషల్ మీడియా వేదికగా ప్రధాని హామీ ఇచ్చారు. 
 
అసోం సోదరసోదరీమణులు పౌరసత్వ సవరణ బిల్లు గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అసోం ప్రజల అందమైన సంస్కృతిని, ప్రత్యేకమైన గుర్తింపును, హక్కులను ఎవరూ హరించలేరని అన్నారు. గుర్తింపు, సంస్కృతి వృద్ధి చెందుతూనే ఉంటాయని మోదీ అన్నారు. అందుకు నేను హామీ ఇస్తున్నానని మోదీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అసోం ప్రజల భూ హక్కులు, రాజకీయ, భాషా, సాంసృతిక హక్కులను పరిరక్షించేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. 

 
అసోంలో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందాక భారీ స్థాయిలో ప్రజలు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం పొరుగు దేశాల నుండి భారతదేశంలో ఆశ్రయం కోరి వచ్చిన శరణార్థులకు పౌరసత్వం కల్పించే దిశగా బిల్లును ప్రవేశపెట్టగా బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందింది. ప్రధాని మోదీ రాజ్యాంగంలోని క్లాజ్ 6 ప్రకారం తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. 
 
అసోం సంస్కృతీ, సాంప్రదాయాలు కలకాలం వర్ధిల్లుతాయని మోదీ హామీతో కూడిన దీవెనలు ఇచ్చారు. లోక్ సభలో బిల్లు ఆమోదం పొందిన తరువాత ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చాయి. మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లో కూడా బిల్లుకు వ్యతిరేకంగా భారీ స్థాయిలో ఆందోళనలు చెలరేగుతున్నాయి. కేంద్రం శాంతి భద్రతల కొరకు దాదాపు 5,000 మంది పారామిలిటరీ సిబ్బందిని ఈశాన్య రాష్ట్రాల్లో మోహరించింది. మోదీ హామీతో అసోం రాష్ట్ర ప్రజలు ఆందోళనలను విరమిస్తారో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: