అధికారంలోకి వచ్చింది మొదలు సీఎం జగన్..గత అయిదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అక్రమాలు వెలికితీతే లక్ష్యంగా వ్యూహాలు పన్నుతూ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఈ అక్రమాలు బయటపెట్టే క్రమంలోనే రాజధాని అమరావతి నిర్మాణం ఆపేసి, అందులో లొసగులు బయటపెట్టే కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలోనే టీడీపీకి ఊహించని షాక్ ఇచ్చేలా జగన్ సరికొత్త వ్యూహంతో ముందుకొచ్చారు. అందులో భాగంగానే రాజధాని ప్రాంతంలో కొనుగోలు చేసి ల్యాండ్‌ పూలింగ్‌కు ఇచ్చిన అసైన్డ్‌ భూములకు రెసిడెన్షియల్, కమర్షియల్‌ ప్లాట్ల కేటాయింపు రద్దుకు తాజాగా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

 

ఇక వీటిని అసలైన అసైన్డ్‌ దారులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే ఈ భూములు కీలకమైన టీడీపీ నేతల బినామీ చేతుల్లో ఉన్నాయని తెలిసింది. అందుకే వారి చిట్టా బయటపెట్టేందుకే గత టీడీపీ ప్రభుత్వంలో అసైన్డ్ భూములు ఉన్నవారికి ఇచ్చిన రెసిడెన్షియల్, కమర్షియల్‌ ప్లాట్లని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అసలు అసైన్డ్ భూములు క్రయవిక్రయాలకు ఎవరికీ అవకాశం లేదు. అయితే, గత ప్రభుత్వం లో మాత్రం దీనికి కొంత మేర మినహాయింపు ఇచ్చారు. 

 

దాంతో అసైన్డ్ భూములను నాడు టీడీపీలో తెర వెనుక ఉన్న కొందరు ప్రముఖులు కొనుగోలు చేసి..వాటిన భూ సమీకరణకు ఇచ్చి..ప్రతిఫలంగా రెసిడెన్షియల్, కమర్షియల్‌ ప్లాట్ల కేటాయింపులో లబ్ది పొందారని సమాచారం. దీంతో పాత ప్రభుత్వంలో అసైన్డ్ దారులకు ఇచ్చిన ప్లాట్లని రద్దు చేసి...అసలైన లబ్ది దారులకు ఇచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే 2500 ఎకరాలకు గానూ 450 ఎకరాల్లో ఉల్లంఘనలు జరిగినట్లు సి‌ఆర్‌డి‌ఏ గుర్తించింది.  రైతుల పేరుతో అసైన్డ్‌ భూములను పూలింగ్‌కు ఇచ్చి... వేరే వ్యక్తుల పేరుతో రిటర్నబుల్‌ ఫ్లాట్ల రిజిస్ట్రేషన్‌ జరిగిందని ఖరారు చేసుకున్నారు. 

 

ఇక ఈ అక్రమాల జాబితాలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రముఖ నేతల పేర్లు ఉన్నట్లు సమాచారం. అందులో ముఖ్యంగా సీఆర్డీఏ అంశాల్లో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రికి చెందిన... బినామీల పేరుతో 70 ఎకరాల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఇక దీనిపై నిజనిర్ధారణ చేసుకుని త్వరలోనే అసలు విషయాలని బయటపెట్టనున్నారని తెలుస్తోంది. మరి చూడాలి ఏ టీడీపీ నేత ఈ అక్రమాల్లో బయటపడతారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: