ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో కడప జిల్లాలో వచ్చే ఎన్నికల్లో మెజారిటి సీట్లు గెలవాలని భావించింది. అందుకు తగిన విధంగా అక్కడ సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా చాలా దూకుడుగా వ్యవహరించింది ఆ పార్టీ... చంద్రబాబు ప్రత్యేకంగా కడప స్టీల్ ప్లాంట్ విషయంలో దూకుడుగా వెళ్ళారు. ఇక ఇంచార్జ్ మంత్రిగా వ్యూహకర్తగా పేరున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని నియమించారు చంద్రబాబు. 

 

ఇక కృష్ణా నీళ్ళ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించి తన కుప్పం నియోజకవర్గం కంటే, పులివెందులకు వేగంగా నీళ్ళు ఇచ్చారు ఆయన. త‌న నియోజ‌క‌వ‌ర్గం కంటే జ‌గ‌న్ నియోజ‌క‌వ‌ర్గానికే బాబు నీళ్లు ఇచ్చార‌ని టీడీపీ శ్రేణులు కూడా గొప్ప‌గా ప్ర‌చారం చేసుకున్నాయి. అయినా సరే జిల్లాలో పార్టీ ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది. ఎంతో అభివృద్ధి చేసిన జిల్లాలో ఆ పార్టీని ప్రజలు కరుణించలేదు. ఇప్పుడు మరి చంద్రబాబు ఏం చేస్తారు...? జిల్లాలో పార్టీని వదిలేసారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. 

 

పార్టీకి అక్కడ సమర్ధవంతులైన నాయకులు లేరు. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాస రెడ్డి పార్టీకి జనాకర్షణ ఉన్న నేత కాలేకపోయారు. ఇక జగన్ మీద పదే పదే పోటీ చేస్తున్న పులివెందుల ఇంచార్జ్ సతీష్ రెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉంది. కీలక నేతలు ఎవరూ కూడా జిల్లాలో కనపడటం లేదు. దీనితో చంద్రబాబు ఇక కడప జిల్లాను పక్కన పెట్టారని అంటున్నారు. ఎవరిని అయినా యువనేతను తీసుకొచ్చినా సరే... జగన్ దూకుడు ముందు నిలబడలేని పరిస్థితి జిల్లాలో ఉంది. 

 

దీనితో ఇక ఆ జిల్లా మీద దృష్టి పెట్టడం అనవసరం అనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారట... ఇదే విషయాన్ని జిల్లా నేతలకు సూచించారట. ఈ అయిదేళ్ళు తాను జిల్లా విషయంలో దృష్టి పెట్టను అని తర్వాత చూద్దామని... మీరు పని చేయండి... సహకారం అందిస్తానని చెప్పారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: