గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన కొందరి పెద్దల జాతకాలకు సంబంధించిన జాబితాను జగన్ ప్రభుత్వం రెడీ చేసినట్టు తెలుస్తోంది. రాజధానిలో అసైన్డ్ భూములకు చెందిన రిటర్నబుల్ ప్లాట్ల రద్దుకు సంబంధించి జగన్ కెబినెట్ తీసుకున్న నిర్ణయం దీనికి మరింత బలం చేకూరుస్తోంది. త్వరలో ఏపీలో ల్యాండ్ మైన్ బద్దలైనా ఆశ్చర్యపోనక్కర్లేదనే చర్చ జరుగుతోంది.

 

ఏపీ రాజధాని అమరావతిలో చాలా అక్రమాలు జరిగాయని గతంలో ఆరోపించిన వైసీపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ మొదలుపెట్టింది. అసైన్డ్ భూముల్లో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని గుర్తించింది సర్కార్. సుమారు 2500 ఎకరాల పరిధిలోని అసైన్డ్ భూముల్లో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ప్రభుత్వం నిర్థారణకు వచ్చింది. మరింత లోతైన విచారణ చేపట్టే దిశగా అడుగులేస్తోంది సీఆర్డీఏ. సుమారు 450 ఎకరాల్లోని అసైన్డ్ భూముల్లో అక్రమాలు జరిగాయనడానికి ప్రభుత్వం వద్ద పక్కా ఆధారాలున్నట్టు సమాచారం. త్వరలో ల్యాండ్ మైన్ బద్దలయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.


రాజధాని పరిధిలో అసైన్డ్ భూముల యజమానులు తమ భూములను ల్యాండ్ పూలింగుకు ఇచ్చి.. రిటర్నబుల్ ప్లాట్లను మాత్రం వేరే వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. ఇలాంటి వాటినే రద్దు చేయాలని ప్రస్తుతం నిర్ణయించుకుంది. ఈ తరహా వ్యవహరంలోనే గత ప్రభుత్వంలో రాజధాని అంశాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి అడ్డంగా దొరికిపోయారని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఈ మేరకు తన బినామీ పేరుతో సుమారు 70 ఎకరాల మేర పరిధిలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం నిర్థారణకు వచ్చినట్టు సమాచారం. ఒక్క ఈ మాజీ మంత్రి విషయమే కాకుండా.. ప్రతిపక్షంలోని ఇంకొందరి పెద్దల పేర్లు కూడా ఉన్నట్టు సమాచారం. ఏ మేరకు అవకతవకలు జరిగాయనే అంశంపై విచారణను సీఆర్డీఏ ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.

 

ఇక అసైన్డ్ భూముల విషయంలోనే కాకుండా.. లంక భూముల విషయంలో కూడా ఇవే రకమైన అవకతవకలు జరిగాయనేది ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో లంక భూముల విషయంలోనూ ఇప్పటికే విచారణ చేపట్టిన ప్రభుత్వం.. త్వరలోనే కేబినెట్లో దీనిపై చర్చించి ఓ తుది నిర్ణయం తీసుకునే సూచనలు కన్పిస్తున్నాయి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: