చటాన్ పల్లి ఎన్ కౌంటర్ పై ఉహించని రీతిలో సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ముగ్గురు సభ్యులతో ఎంక్వైరీ కమిషన్ ను వేసింది. ఎన్ కౌంటర్ పై కమిషన్ ఎలాంటి విచారణ చేస్తుంది, కమిషన్ కు ఉన్న పరిధి ఏంటనేది ఆసక్తికరంగా మారింది. 

 

దిశపై హత్యాచారం తర్వాత చటాన్ పల్లిలో జరిగిన ఎన్ కౌంటర్ పై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. ఎన్ కౌంటర్ ను సీరియస్ గా తీసుకుని ఎంక్వైరీ కమిషన్ వేసింది. మిగతా విచారణలన్నీ నిలిపేస్తూ ఆదేశాలిచ్చింది. హైకొర్టుతో పాటు జాతీమ మానవ హక్కుల కమిషన్ ఎంక్వైరీ కూడా నిలిచిపోయింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ మీద స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు సుప్రీం కోర్టు. సిట్ విచారణలో ఎంక్వైరీ కమిషన్ కు సమాంతరంగా పనిచేస్తుందా..? దానికే సాయం చేస్తుందా అనే విషయంలో స్పష్టత లేదు. 

 

అత్యంత అరుదైన సందర్భాల్లోనే సుప్రీం కోర్టు ఎంక్వైరీ కమిషన్ వేస్తుంది. ఇప్పటి వరకు ముంబయి అల్లర్లు, గుజరాత్ అల్లర్లు, పార్టమెంట్ పైన దాడి జరిగినప్పుడు మాత్రమే ఎంక్వైరీ కమిషన్లు ఏర్పాటయ్యాయి. ఈ మూడు అంశాల్లోనూ సుప్రీం కోర్టు పరిధిలోనే విచారణ జరిగింది. రాష్ట్ర అధికారులను కమిషన్ లో నియమించుకున్నా.. వాళ్లు కూడా సుప్రీం కోర్టు ఆదేశాలకు లోబడి పనిచేయాలి. ఎంక్వైరీ అఫ్ కమిషన్ రూల్స్ దీనికి వర్తిస్తాయి. స్వత్వంత్రంగా పనిచేసే ఈ కమిటీలో ముగ్గురు సభ్యులూ కీలకమే. 


ముగ్గురు సభ్యులూ సీజేఐతో భేటీ అయిన తర్వాత విధివిధానాలు ఖరారవుతాయి. కమిషన్ హైదరాబాద్ కు వచ్చి పని మొదలుపెట్టిన ఆరు నెలల్లో సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం హైదరాబాద్ లేదా సైబరాబాద్ లో ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకుంటారు. ఆఫీస్ తో పాటు ముగ్గురు సభ్యులకు కూడా సీఆర్పీఎఫ్ భద్రత కల్పిస్తుంది. కమిషన్ విచారణ తీరుపై పూర్తి గోప్యత పాటిస్తారు. దిశ తన ఇంటి నుంచి బయలు దేరినప్పటి నుంచి చనిపొయిన వరకు కూడా విచారణ చేస్తుంది. దీంతో పాటుగా నిందితులను అరెస్టు చేసినప్పటి నుంచి ఎన్ కౌంటర్ జరిగిన వరకు ఈ కమిషన్ విచారిస్తుంది. ఎన్ కౌంటర్ లో పాలు పంచుకున్న అధికారులను కూడా ప్రశ్నిస్తుంది. ఎన్ కౌంటర్ లో గాయపడిన పోలీసుల  నుంచి కూడా స్టేట్ మెంట్ ను రికార్డు చేస్తుంది. పోస్ట్ మార్టమ్ చేసిన డాక్టర్లతో పాటు ఫోరెన్సిక్ నిపుణుల్ని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే కమిషన్ ఎప్పుడు రంగంలోకి దిగుతుందన్న విషయంలో కూడా క్లారిటీ లేదు. 

 

సుప్రీం ఆదేశాలతో కమిషన్ పని మొదలుపెట్టాక.. సిట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందనేది తేలుతుంది. అటు ఎన్ కౌంటర్లో చనిపోయిన వారి మృతదేహాలపై కూడా హైకోర్టు ఏ నిర్ణయం తీసుకునే వీలు లేకుండా పోయింది. ఇకపై ఈ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: