రోజురోజుకు ఆకాశాన్ని తాకుతున్న ఉల్లిధరలను చూసి సామాన్య ప్రజలు ఉల్లిని కొనాలంటే భయపడుతున్నారు. సామాన్యులకు కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి ధరల వలన కొన్ని ప్రాంతాలలో ఉల్లి దొంగతనాలు కూడా జరుగుతున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. టిక్ టాక్ లో, సోషల్ మీడియాలో ఉల్లి గురించి ఇప్పటికే మీమ్స్, ఫన్నీ వీడియోలు వైరల్ అవుతున్నాయన్న విషయం తెలిసిందే.
 
ఆన్ లైన్ బస్ బుకింగ్ సంస్థ అబిబస్ ఒక వినూత్న ఆఫర్ ను ప్రకటించింది. అబిబస్ వెబ్ సైట్ ద్వారా గోవా ట్రిప్ బుక్ చేసుకున్న వారికి 3 కేజీల ఉల్లి ఉచితంగా ఇవ్వనున్నట్లు అబిబస్ ప్రకటన చేసింది. డీల్ ఆఫ్ ది ఇయర్ పేరుతో ఈ ఆఫర్ ను అబిబస్ సంస్థ పేర్కొంది. ఎక్కువగా పర్యాటక ప్రాంతాల్లో పర్యటించే పర్యాటక ప్రియులు ఈ ఆఫర్ పట్ల ఆసక్తి చూపుతున్నారు. అబిబస్ గోవా టూర్ కు ఎక్కువ డబ్బులు వెచ్చించినవారికి ఐ ఫోన్ లేదా ఈ - బైక్ గెలుచుకునే మరో ఆఫర్ కూడా ప్రకటించింది. 
 
కానీ టికెట్లు బుక్ చేసుకుంటున్న వారు ఎక్కువగా 3 కిలోల ఉల్లి బహుమతిని ఎంచుకోవటానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆఫర్ గురించి అబిబస్ సంస్థ సీవోవో రోహిత్ శర్మ స్పందించారు. టికెట్లు బుక్ చేసుకున్న వారు గోవా పర్యటన కంటే ఉల్లిపాయలకే అధికంగా ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా వినియోగదారులకు ఆఫర్లు అందిస్తున్నామన్న సంతృప్తి తమకు కలిగిందని రోహిత్ శర్మ చెప్పారు. 
 
3 కేజీల ఉల్లి ఆఫర్ నిర్ణయం సరైనదే అనే నమ్మకం వచ్చిందని చెప్పారు. ఈ ఆఫర్ ను ఎంచుకున్న వారిలో ప్రతిరోజు 20 మందిని విజేతలుగా ప్రకటిస్తామని విజేతల ఇంటికి 3 కిలోల ఉల్లిని డెలివరీ చేస్తామని చెప్పారు. డిసెంబర్ 10వ తేదీన అబిబస్ సంస్థ ఈ ఆఫర్ ను ప్రకటించింది. ఈ నెల 15వ తేదీ వరకు ఈ ఆఫర్ కోసం అబిబస్ వెబ్ సైట్ ద్వారా గోవా టూర్ ను బుక్ చేసుకొని విజేతలుగా నిలవచ్చు. ఈ అఫర్ ప్రకటనతో పర్యాటక ప్రదేశాల బుకింగ్ లో వెనుకంజలో ఉండే గోవా రెండవ స్థానంలో నిలిచిందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: