ఏపీ అసెంబ్లీలో ఓ వైసీపీ ఎమ్మెల్యే కన్నీరుపెట్టుకున్నారు. తెలుగుదేశం హయాంలో తనను పెట్టిన ఇబ్బందులు తలచుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఎమ్మెల్యేగా ఉన్న తనను టీడీపీ హయాంలో తీవ్రవాదికంటే దారుణంగా కొట్టారని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఆయన తన గత పరిస్థితిని వివరించారు.

 

చెవిరెడ్డి ఏమన్నారంటే.. “ ఆ రోజు నాపై ఎంతో నిరంకుశంగా వ్యవహరించారు. వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త తన ఇళ్లు కూల్చారని ఆర్డీవో ఆఫీస్‌ ముందు నిరసనకు కూర్చున్నాడు. తాను వెళ్లాను. అయితే సబ్ కలెక్టర్‌ను దూషించానని నాపై కేసు పెట్టించారు. కులంపేరుతో దూషించారని కడప సెంట్రల్‌ జైల్‌లో పెట్టారు. సింగిల్‌ జైల్‌లో పెట్టారు. నేను బయట కూర్చుంటే జైలర్‌ వచ్చి ఎగిరి కాలితో తన్నాడు. ఎందుకు తన్నాడో కారణం చెప్పలేదు.

 

రెండు రోజులు నీళ్లు కూడా ముట్టకుండా నిరాహారదీక్ష చేపట్టాను. ట్యాప్‌లు పెట్టి ఓట్లు తొలగిస్తుంటే మా కార్యకర్తలను చిత్తూరు పోలీసు స్టేషన్‌ తీసుకెళ్లి కళ్లకు గంతలు కట్టి కొట్టారు. ఎందుకు కొడుతున్నారని ధర్నా చేస్తే..ఎమ్మెల్యేగా ఉన్న నన్ను తమిళనాడుకు తీసుకెళ్లారు. బస్సులో కిందపడుకోబెట్టి.. తమిళనాడంతా తిప్పారు. తలను బస్సుకు కొట్టారు. తల నొప్పి వస్తే ఒక్క మాత్ర కూడా ఇవ్వలేదు. సత్తివాడ పోలీసు స్టేషన్‌లో పెట్టారు. మా ఎమ్మెల్యేంతా ఒక్కటై సంఘీభావం తెలిపారు.

 

ఈ రోజు తాకారు, తట్టారని టీడీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు పుట్టిన ఊరికి ఎమ్మెల్యే అయితే నన్ను శిక్షించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆ రోజు అడ్డగోలుగా వ్యవహరించింది టీడీపీ నేతలే. అసెంబ్లీ బయట నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపితే అరెస్టు చేశారు. ఈ రోజు టీడీపీ నేతలు నీతులు మాట్లాడుతున్నారు. వాళ్లే ఉన్మాది అంటున్నారు. వాళ్లే తిడుతున్నారు. అన్ని కూడా భగవంతుడు చూస్తున్నాడు. నన్ను తీవ్రవాదికంటే దారుణంగా కొట్టారు.. అంటూ ఆనాటి విషయాలు గుర్తు చేసుకున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: