మీ-సేవా కేంద్రంలో ఏమైనా పని ఉంటే ఈరోజు (డిసెంబర్ 13) రాత్రి 7 గంటల లోపు చూసుకోవడం మంచిది. ఈరోజు రాత్రి 7 గంటల నుంచి డిసెంబర్ 16 ఉదయం వరకు తెలంగాణ రాష్ట్రం లోని అన్ని మీ సేవా కేంద్రాలు మూసి ఉంటాయి. మీ సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిచేందుకు గానూ డేటాబేస్ మైగ్రేషన్ చేపడుతున్నందున 3 రోజుల పాటు మీ సేవా సర్వర్లు అందుబాటులో ఉండవు కావున ఈ మూడు రోజుల పాటు మీ సేవా కేంద్రాలను మూసి ఉంచనున్నారు. 

 

నిజామాబాద్ జిల్లా ఈడీఎం కార్తీక్ ఒక ప్రకటనలో "తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు మీ సేవా కేంద్రాలు మూసి ఉంచుతున్నాం. ప్రజలకు మీ సేవా ద్వారా మరింత చేరువ అయ్యేందుకు డేటాబేస్ మైగ్రేషన్ చేస్తున్న కారణంగా ఈ 3 రోజులు మీ సేవా కేంద్రాలు అందుబాటులో ఉండవు" అని తెలిపారు. మీ సేవా కేంద్రాల నిర్వాహకులకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రజలకు కూడా మీ సేవా కేంద్రాలు మూడు రోజుల పాటు అందుబాటులో ఉండవు అనే విషయాన్ని తెలపాలని మీ సేవా కేంద్రాల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు అధికారులు.

 

మీ సేవా ద్వారా కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణపత్రాలతో పాటు, ఆహారభద్రత కార్డు, పహానీలు, 1బి ప్రధాన సేవలతో పాటు ఇతర సేవలను అందిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి మీ సేవా కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారు. ప్రజలు కాళ్ళరిగేలా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగకుండా మీ సేవా కేంద్రాల్లోనే దాదాపు అన్నీ సేవలు లభిస్తున్నాయి. సేవని బట్టి ప్రజల నుంచి రుసుము వసూల్ చేస్తున్నారు. ఇక నేటి నుంచి 3 రోజుల పాటు మీ సేవా కార్యాలయాలు పని చేయకపోవడంతో ప్రజలకు అంతరాయం కలగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: