ఏపీ అసెంబ్లీ గేటు వద్ద మార్షల్స్ టీడీపీ నేతలను అడ్డుకున్నారన్న వివాదం అసెంబ్లీలో కలకలం సృష్టించింది. అదే సమయంలో అసెంబ్లీ గేటు వద్ద చంద్రబాబు .. ఒక ఉన్మాది రాష్ట్రానికి సీఎంగా ఉంటే.. మీరు ఉన్నాదుల్లా ప్రవర్తిస్తారా అని వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఆయన వ్యాఖ్యలను ఏపీ అసెంబ్లీలో తెరపై ప్రదర్శించారు. చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడ్డారు.

 

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల అమర్యాదగా మాట్లాడిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సభలో చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబుకు అసెంబ్లీ ఆవరణలో ఎవరూ అడ్డుపడలేదని, ఎక్కడా అగౌరవ పరిచే మాటలు మాట్లాడలేదన్నారు. కావాలనే చంద్రబాబు ముఖ్యమంత్రిని ఉన్మాది అంటూ అమర్యాదగా మాట్లాడారన్నారు.

 

అమర్యాదగా మాట్లాడిన చంద్రబాబు వెంటనే ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలని, చెప్పలేకపోతే ఆయన విజ్ఞతకే వదిలేసి ప్రజా సమస్యలపై చర్చ జరపాలని కోరారు. ముఖ్యమంత్రిపై చంద్రబాబే కామెంట్లు చేసి సభలోకి వచ్చి గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంసజం అని ప్రశ్నించారు. ఉన్మాది అన్నది ఎవరో ఈ సభలో తేలాలని ఎమ్మెల్యే జోగి రమేష్‌ డిమాండు చేశారు.

 

ప్రతిపక్ష నేత చంద్రబాబు సీఎంను ఉద్దేశించి అన్న ఉన్మాది అనడం దుర్మార్గం. మనస్సున్న వైయస్‌ జగన్‌ను ఈ మాట అంటారా? ఎన్టీరామారావును మానసిక క్షోభకు గురి చేసిన చంద్రబాబును అంటారా తేలాలి. ఈ రోజు మార్షల్స్‌ను టీడీపీ నేతలు బెదిరించారు. ఫోటోలు తీసి అధికారులను బ్లాక్‌మెయిల్‌ చేస్తారా? ఉన్మాది అన్న మాట మాట్లాడటం తప్పే. చంద్రబాబు ఈ సభలో క్షమాపణ చెప్పాల్సిందే. ఉన్మాది అనే మాటను చంద్రబాబు వెనక్కి తీసుకోవాలన్నారు జోగి రమేశ్.

 

మరోవైపు జగన్ స్పందిస్తూ.. చంద్రబాబు లాంటి వ్యక్తి క్షమాప‌ణ‌లు చెప్తార‌నుకోవ‌డం మ‌న అవివేక‌మే. ముఖ్యమంత్రిని ఉన్మాది అని మాట్లాడిన చంద్రబాబు వ్యక్తిత్వాన్ని త‌న‌కే వ‌దిలేస్తున్నా. బ్లాక్ క్యాట్ కమాండోలున్న చంద్రబాబును మార్షల్స్ బెదిరించారో, మార్షల్స్‌ని చంద్రబాబు బెదిరించారో వీడియోలో అంద‌రం చూశాం. ముఖ్యమంత్రిని దుర్భాష‌లాడిన వ్యక్తిత్వం ఆయ‌న‌దైతే.. స‌భా గౌర‌వాన్ని కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది.. అన్నారు జగన్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: