అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమై ఐదు రోజులైంది. ఇపుడు కానీ అంతకుముందు కానీ అసెంబ్లీ సమావేశాలంటే గొడవలు తప్ప ఇంకేమి ఉండటం లేదు. అసెంబ్లీ సమావేశాలంటే  గొడవలేనా ప్రజాసమస్యలపై అర్ధవంతమైన చర్చలుండవా ? అన్న మామూల జనాల ప్రశ్నలకు సమాధానలు చెప్పే వాళ్ళేరి ?

 

చంద్రబాబునాయుడు హయాంలో అయినా జగన్మోహన్ రెడ్డి హయాంలో అయినా జరుగుతున్నది ఇదే. గొడవల మధ్య ఎప్పుడో కానీ ప్రజా సమస్యలపై చర్చలు జరగటం లేదు. ప్రజా సమస్యల పరిష్కారంపై సరైన పద్దతిలో చర్చలు జరగటం లేదన్నది సామాన్య జనాలభిప్రాయం. అసలు అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరుగుతోంది ?

 

ఏం జరుగుతోందంటే అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య  ఆధిపత్య  పోరాటం మాత్రమే  అని చెప్పక తప్పదు. ప్రతిపక్ష ఎంఎల్ఏల గొంతు నొక్కేయాలని అధికారపార్టీ సభ్యులు చూడటంతోనే అసలు సమస్య మొదలవుతోంది. విషయం ఏమైనా సరే  రెండు పార్టీలు కూడా ఒకదానిపై  మరొకపార్టీ ఆధిపత్యం ప్రదర్శించాలని ప్రయత్నం చేయటంతోనే సమస్యలు పెరిగిపోతున్నాయి.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అధికార పార్టీ అనుకున్నట్లే సభా కార్యక్రమాలు జరుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు హయాంలో అలాగే సభా కార్యక్రమాలను జరుపుకున్నారు. కాబట్టే ఇపుడు జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే చేసుకుంటున్నారు. దీన్నే చంద్రబాబు సహించలేకపోతున్నారు.

 

అధికారంలో ఉన్నపుడు తాము అనుకున్నట్లు సభ జరిగినట్లే ఇపుడు కూడా తానే డిక్టేట్ చేయాలని, తాను అనుకున్నట్లే కార్యక్రమాలు జరగాలని చంద్రబాబు అనుకోవటంతోనే సమస్యలు పెరిగిపోతున్నాయి. తన హయాంలో జగన్ ను కానీ వైసిపి సభ్యులను కానీ నోటికొచ్చినట్లు మాట్లాడిన, మాట్లాడించిన విషయాన్ని చంద్రబాబు కన్వీనియంట్ గా మరచిపోయారు. అప్పుడు తాను చేసినట్లే ఇపుడు జగన్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు.

 

రెండు పార్టీల మధ్య ఆధిపత్య ధోరణి వల్లే ప్రజా సమస్యలు గాలికి కొట్టుకుపోతున్నాయి.  రెండు పార్టీల్లో ఏదో ఒకపార్టీ తన వైఖరిని మార్చుకోనంత కాలం సభా కార్యక్రమాలు ఇలాగే జరుగుతుందనటంలో సందేహం లేదు. అసెంబ్లీ సమావేశాల పనితీరుకన్నా శాసనమండలిలో  కార్యక్రమాలు కాస్తనయం అనిపిస్తున్నాయి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: