వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సూపర్ ట్విస్టు చోటు చేసుకుంది. హత్య కేసు విచారణను సిబిఐకి అప్పగించాలంటూ టిడిపి నేత హైకోర్టులో కేసు వేశారు. అధికారంలో ఉన్నపుడు సిబిఐని రాష్ట్రంలోకి రానీయకుండా బ్యాన్ చేసిన ఇదే చంద్రబాబుకు ప్రతిపక్షంలోకి రాగానే  సిబిఐ విచారణ ముద్దయ్యింది.

 

వివేకా హత్యకేసులో విచారణను ఎదుర్కొంటున్న టిడిపి ఎంఎల్సీ బిటెక్ రవి కోర్టులో ఓ పిటీషన్ వేశారు. రాష్ట్రప్రభుత్వ పరిధిలో పనిచేసే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టిం (సిట్) విచారణపై తమకు నమ్మకం లేదన్నారు. విచారణ నిష్పక్షపాతంగా జరిగి హంతుకులు ఎవరో తేలాలంటే సిబిఐ విచారణ జరపాలంటూ  కోర్టులో కేసు వేశారు.

 

టిడిపి నేత కేసును పరిశీలించిన హై కోర్టు కేసు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. సరే కోర్టు ఏమి నిర్ణయిస్తుందన్నది వేరే సంగతి. వివేకా హత్య జరిగింది చంద్రబాబునాయుడు హయాంలోనే. అప్పట్లోనే ఈ కేసు విచారణను సిబిఐకి అప్పగించమని వివేకా కూతురు  డిమాండ్ చేస్తే చంద్రబాబు పట్టించుకోలేదు.

 

పైగా  వివేకా హత్యకు కారణం మీరేనంటే కాదు మీరేనంటూ టిడిపి-వైసిపి నేతలు ఒకరిపై మరొకరు ఎంతలా ఆరోపణలు చేసుకున్నారో అందరూ చూసిందే.  వివేకా హత్యలో జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ కుటుంబసభ్యుల హస్తముందంటూ అప్పట్లో చంద్రబాబు బహిరంగ సభల్లో కూడా ఎన్నోసార్లు ఆరోపణలు గుప్పించారు. అప్పట్లో ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డి, బిటెక్ రవి అండ్ కో నే వివేకా హత్యకు మూల సూత్రదారులంటూ వైసిపి నేతలు ఎదురు ఆరోపణలు చేశారు.

 

మొత్తానికి ఎవరి పాత్ర ఎంతుందో అప్పట్లో తేలలేదు కానీ ప్రస్తుం హత్యకేసును ఎవరు విచారించాలనే విషయం మాత్రం వివాదాస్పదమవుతోంది. ఎందుకంటే హత్యకేసును విచారించేందుకు జగన్ ప్రత్యేకంగా సిట్ ను నియమించారు. అందుకనే సిట్ స్ధానంలో సిబిఐతోనే విచారణ చేయించాలని టిడిపి నేత  డిమాండ్ చేస్తున్నారు. మరి చూడాలి హై కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ?

=

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: