అసెంబ్లీ సమావేశాలంటే అధికార ప్రతిపక్షాలు దూషించుకోవడం సాధారణ విషయమే. కానీ ఏపీ అసెంబ్లీలో ఇప్పుడో సంఘటన చర్చనీయాంశమైంది. నిన్న తమను అసెంబ్లీ ఆవరణలో చీఫ్ మార్షల్ అడ్డుకున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వారిని దూషించే హక్కు మీకెక్కిడిదని వైసీపీ నాయకులు ఒకరికొకరు ఆరోపించుకుంటున్నారు. మొత్తం సభ అంతా దీనిపైనే నడుస్తూ రసాభాసగా మారింది.

 

 

దీనిపై సీఎం జగన్ మాట్లాడుతూ.. 'చంద్రబాబు రావాల్సిన గేటు అది కాదు. సభ్యులు కానివారితో ఊరేగింపుగా చంద్రబాబు వచ్చారు. అంతమంది వచ్చినప్పుడు తనిఖీలు చేసేందుకు మార్షల్స్ ఆపారు. చంద్రబాబు.. చీఫ్ మార్షల్‌ను బాస్టర్డ్ అన్నారు. చీఫ్ మార్షల్‌ను చంద్రబాబు దూషించడమేంటి? లోకేశ్ అయితే ఏకంగా మార్షల్ గొంతు పట్టుకున్నారు. ఎవరు ఎవరిపైన దాడి చేశారో తెలుస్తోంది. మార్షల్స్ పై చంద్రబాబు, లోకేశ్ తీరు దారుణం' అని అన్నారు. ప్రతిగా బాబు మాట్లాడుతూ.. 'బాస్టర్డ్ అనే పదం నేను వాడలేదు. వాళ్లు చూపించిన వీడియోలో కూడా ఆ పదం లేదు. నో క్వశ్చన్ పదాన్ని బాస్టెడ్ గా చిత్రీకరించారు. లేని దాన్ని ఉన్నట్లుగా అసెంబ్లీలో చూపించారు. అనని దాన్ని అన్నట్లు చిత్రీకరించిన సీఎంపై ప్రివిలీజ్ మోషన్ ఇస్తాం. జగన్ ఉన్మాది అనడానికి ఇదే ఒక గుర్తు. నా నోటి నుండి ఎప్పుడు బూతులు రావు. ఎప్పుడైనా కోపం వస్తే గట్టిగా మాట్లాడతా. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకూడదా.. వాళ్లు ఏమైనా దొంగలా?' అని ప్రశ్నించారు.

 

 

దీంతో సీఎం జగన్‌పై స్పీకర్‌కు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది టీడీపీ. సీఎం జగన్ సభను తప్పుదోవపట్టిస్తున్నారని టీడీపీ ఆరోపించింది. మరోవైపు టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ ద్వారాల వద్ద ఆందోళన చేసిన సభ్యులు కానీ వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్పీకర్ ఆదేశించారు. దీనిపై డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. నిన్న జరిగిన సంఘటనలో కొన్ని అన్‌పార్లమెంటరీ వ్యాఖ్యలు ఉన్న మాట వాస్తవం. ఇలాంటి పదాలు పార్లమెంటరీ వ్యవస్థకు మంచిది కాదు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: