నిర్భయ దోషులకు మరణదండన ఖాయంకావడంతో.. అందుకు అవసరమైన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఘటన జరిగిన ఏడేళ్ల తర్వాత ఉరిశిక్ష అమలుకు రంగం సిద్ధమవుతోంది. మరోవైపు నలుగురు దోషుల్లో ఒకరైన అక్షయ్ సింగ్ వేసిన రివ్యూ పిటిషన్‌.. ఈ నెల 17న సుప్రీం ముందుకు రానుంది. 


నిర్భయను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, ఆమె హత్యకు కారణమైన నేరస్థుల క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించారు. దీంతో  నలుగురు నిందితులకు కోర్టు విధించిన ఉరి శిక్ష అమలు కానుంది. ఈ కేసులో దోషి అక్షయ్‌సింగ్ వేసిన రివ్యూ పిటిషన్‌పై ఈనెల 17న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. 30 రోజుల్లో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాల్సి ఉండగా, రెండేళ్ల తర్వాత పిటిషన్‌ దాఖలైందంటున్నారు నిర్భయ తరఫు న్యాయవాది సీమా కుష్వా. జాప్యం కారణంగా 17న జరిగే విచారణలో కోర్టు రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చడం ఖాయమంటున్నారు.

 

నిర్భయ దోషులను ఉరి తీసేందుకు సిద్ధమతున్నారు అధికారులు. ఇద్దరు దోషులను ఉరి తీసేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఉత్తర్‌ ప్రదేశ్‌ అడిషనల్‌ డీజీని తీహార్ జైలు అధికారులు కోరారు. దీంతో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసింది యూపీ జైళ్లశాఖ. ఉరి తీసేందుకు ఎప్పుడైనా సిద్ధమేనంటూ జైళ్లశాఖ డీజీ ప్రకటించారు. ఇటు తీహార్‌ జైల్లోనూ గదిని సిద్ధం చేశారు. అక్కడ సెక్యూరిటీని పెంచారు. 

 


ఆరుగురు దోషుల్లో ఒకరు జైల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మరొకరు మైనర్‌ కావడంతో మూడేళ్ల పాటు జువైనల్‌ హోంకి పంపారు. ముగ్గురు సభ్యుల ధర్మాసనం దీనిపై విచారణ జరపుతుంది. దోషులందరినీ ప్రస్తుతం తీహార్‌ జైలు నంబర్‌ మూడులో వేర్వేరు గదుల్లో ఉంచారు. సీసీటీవీ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జైలు నంబర్‌ 3లోనే దోషులకి ఉరిశిక్ష అమలు చేయనున్నారు. ఇటీవల మండోలి జైలులో ఉన్న పవన్‌ కుమార్‌ గుప్తాను తీహార్‌ జైలుకి తరలించినట్టు జైళ్ల శాఖ డైరెక్టర్‌  జనరల్‌ సందీప్‌ గోయెల్‌ వెల్లడించారు. ముఖేష్‌ సింగ్, అక్షయ్‌ సింగ్, వినయ్‌ శర్మను ఉంచిన జైలు నెంబర్‌3లో పవన్‌ కుమార్‌ గుప్తాను ఉంచారు. ఇప్పుడు దోషులందరూ ఒకే జైలుకి చేరడంతో వారికి ఉరిశిక్ష అమలు జరపడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఐతే...సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ విచారణకు రానుండటంతో ఉరి ఎప్పుడు అమలు చేస్తారనేది మాత్రం త్వరలోనే తేలిపోనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: