తెలుగు రాష్ట్రాల ఉద్య‌మ‌కారుల్లో కీల‌క‌మైన నేత క‌న్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న  జనశక్తి నేత చంద్రన్న గురువారం క‌న్నుమూశారు. డిసెంబర్ 13న హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో ఆయ‌న తుది శ్వాస విడిచారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రభుత్వానికి నక్సలైట్లకు మధ్య జరిగిన చర్చల్లో జనశక్తి పక్షాన ప్రతినిధిగా పాల్గొన్నారు. అప్పటి నుంచి ఆయనను చర్చల చంద్రన్న అని పిలుస్తుంటారు. ఆయన మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అని పలువురు పేర్కొన్నారు.

 

యాదాద్రి జిల్లా టంగుటూర్‌ గ్రామానికి చెందిన చంద్రన్న మొదట్లో ఈసీఐఎల్‌ ఉద్యోగిగా పనిచేశారు. ఉద్యోగం చేసే సమయంలోనే ఆయనకు విప్లవ కార్మిక సంఘాలతో పరిచయం ఏర్పడింది. అనంత‌రం చంద్రన్న జనశక్తిలో చేరారు. హైదరాబాద్ అంబర్‌పేట డీడీ కాలనీలోని తన నివాసంలో చంద్రన్న ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందారు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రన్న ఆరునెలలుగా అస్తమాతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. రోజూలాగే గురువారం రాత్రి భోజనం చేసేందుకు సిద్ధమై ఒక్కసారిగా కుర్చీలోనే కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు వెంటనే విద్యానగర్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ దవాఖానకు తీసుకెళ్లగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే చంద్రన్న మృతిచెందినట్టు నిర్ధారించారు. జనశక్తి మాజీ నేత, ఏఐఎఫ్‌టీయూ నాయకుడు, మావోయిస్టులతో చర్చల ప్రతినిధి క‌న్నుమూసిన విష‌యాన్ని ఆ సంఘాలు వెల్ల‌డించాయి.

 


చంద్రన్న అకాల మరణం విప్లవోద్యమాలకు తీరని లోటు అని పేర్కొంటున్నారు. ఆయన మృతికి సంతాపం, ఆయన కుటుంబ సభ్యులకు, ఉద్యమ సహచరులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 50 ఏళ్ల పాటు ఆయన జీవితం విప్లవోద్యమాలతో పెనవేసుకుపోయిందని గుర్తు చేశారు. నిరంతరం కష్టజీవులు, కార్మికులు, పేదల కోసం పోరాటాలు చేశారు. బీడీ, సింగరేణి కార్మికులకు సంబంధించిన అనేక పోరాటాలకు చంద్రన్న నాయకత్వం వహించారు. చంద్రన్న మృతి పట్ల న్యూడెమోక్రసీ సంతాపం ప్రకటించింది. చంద్రన్న అంత్యక్రియలు శుక్రవారం ఉదయం 11 గంటలకు రాంనగర్‌లోని స్మశాన వాటికలో జరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: