దోస్తీకి రాజ‌కీయాల‌కూ సంబంధం లేద‌ని పొరుగున ఉన్న ముఖ్య‌నేత‌లు నిరూపించారు. కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు సిద్ధరామయ్యను కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప పరామర్శించారు. సిద్ధరామయ్య ఛాతీ నొప్పితో  ఆస్పత్రిలో చేరారు. యడియూరప్ప వెంట రాష్ట్ర మంత్రులు కేఎస్ ఈశ్వరప్ప, బసవరాజ బొమ్మై వెళ్లి సిద్ధరామయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సిద్ధరామయ్య యోగక్షేమాల గురించి బీజేపీ నేత‌లు వాకబు చేశారు. స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు.

 

ఇదిలాఉండ‌గా, తన ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న పుకార్లను సిద్ధరామయ్య  కొట్టిపారేశారు. వాటిలో ఏమాత్రం నిజం లేదని సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. మ‌రోవైపు సిద్ధ‌రామ‌య్య కుమారుడు యతింద్ర సిద్ధరామయ్య సైతం క్లారిటీ ఇచ్చారు. డాక్టర్ల సలహా మేరకు సిద్ధరామయ్యకు ఆంజియోప్లాస్టి చేయిస్తున్నామని యతింద్ర తెలిపారు. తన తండ్రి సిద్ధరామయ్య గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని స్పష్టం చేశారు. డాక్టర్‌ రమేశ్‌ నేతృత్వంలోని వైద్య బృందం తన తండ్రి సిద్ధరామయ్యను పరీక్షిస్తుందని చెప్పారు. గుండెకు రక్తప్రసరణ సరిగా జరగడం లేదని వైద్యులు చెప్పినట్లు యతింద్ర పేర్కొన్నారు. కాగా, తండ్రికొడుకులు ఇద్ద‌రూ..మాజీ ముఖ్య‌మంత్రి ఆరోగ్యం గురించి ఏక‌కాలంలో క్లారిటీ ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

 

ఇదిలాఉండ‌గా, క‌ర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఇటీవ‌లే సీఎల్పీ పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు.  మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్‌ పార్టీ కేవలం 2 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. బీజేపీ 12 స్థానాల్లో గెలిచింది. దీంతో సిద్ధ‌రామ‌య్య ప‌ద‌వికి బైబై చెప్పేశారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని, అందుకే సీఎల్పీ పదవికి రాజీనామా చేశానని సిద్ధరామయ్య తెలిపారు. తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపానని ఆయన పేర్కొన్నారు. శాసనసభ ప్రతిపక్ష హోదా పదవికి కూడా రాజీనామా చేసినట్లు సిద్ధరామయ్య చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: