ఆర్టీసీలో వెయ్యి బస్సులపై వేటుకు రంగం సిద్ధమైంది. కాలం చెల్లిన వాటిని రద్దు చేయాలని అధికారులు నిర్ణయించారు. నష్టాల ఊబిలో వున్న గ్రేటర్ ఆర్టీసీ నుంచే అధిక శాతం బస్సులను తొలగించాలని భావిస్తోంది. 


ఆర్టీసీ ప్రక్షాళన దిశగా యాజమాన్యం చర్యలు పెట్టింది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలో పట్టించేందుకు కార్యాచరణ మొదలు పెట్టింది.  ప్రస్తుతం ఆర్టీసీ 3726 రూట్లలో 10,460 బస్సులతో ప్రజలకు సేవలందిస్తోంది. ఇందులో ఆర్టీసీ బస్సులు 8357 కాగా, 2103 అద్దె బస్సులు. ఇందులో కాలం చెల్లిన బస్సులు ఉండటంతో...బస్సులను రద్దు చేయాలని భావిస్తున్నారు అధికారులు. గ్రేటర్‌ జోన్‌లో నడిచే బస్సులనే ఎక్కువగా రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒక్కో డిపో నుంచి 30 బస్సుల లెక్కన 29 డిపోల నుంచి 870 బస్సులు రద్దు చేస్తారని సమాచారం. జిల్లాల్లో మరో 150 బస్సుల వరకు రద్దు చేయాలని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ ప్రతిపాదనలను రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి, ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌ శర్మకు పంపించారు. అక్కడి నుంచి అనుమతి రాగానే ఆయా డిపోల వారీగా రద్దు చేస్తారు.


ఐతే రద్దు చేసిన బస్సులను సరకు రవాణాకు వినియోగించాలని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే డిపో మేనేజర్లు క్షేత్రస్ధాయిలో సరుకు రవాణా చేసే ప్రైవేట్‌ సంస్థల వద్దకు వెళ్లి పరిశీలించారు. ఆయా సంస్థలకు వచ్చే లాభనష్టాలను బేరీజు వేసుకున్నారు. ప్రైవేట్ సంస్థలు  రవాణా చేస్తున్న అంశాలను పరిశీలించారు. వాటిని ఉన్నతాధికారులకు నివేదించారు. వీటి ఆధారంగా సరుకు రవాణాపై ఆర్టీసీ అధికారులు వీలైనంత త్వరగా విధివిదానాలను రూపొందించాలని చూస్తున్నారు. ఇటీవల ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ ఈడీలతో సమావేశమయ్యారు. ఇప్పటి వరకు అమలు చేస్తున్న అంశాలను ఈడీలు ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మకు వివరించారు. ఈ సమావేశంలో సరుకు రవాణాపై కూడా ప్రధానంగా చర్చించారు.

 

కొద్దిరోజుల్లోనే సరుకు రవాణా చేసేందుకు అవసరమైన విధివిధానాలు రూపొందిస్తారని సమాచారం. ఆర్టీసీలో వెయ్యి బస్సుల రద్దును ఆర్టీసీ కార్మిక సంఘాలు తప్పుబడుతున్నాయి. హైదరాబాద్‌లో సరిపడా బస్సులు లేవనీ, ఉన్న బస్సులను రద్దు చేస్తే ప్రయాణీకులు మరింత ఇబ్బందిపడుతారని ఆరోపిస్తున్నాయి. యాజమాన్యం మరోసారి ఆలోచించాలని కోరుతున్నారు యూనియన్ నేతలు. మొత్తానికి ఆర్టీసీలో బస్సుల రద్దుపై ఇప్పుడు చర్చ సాగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: