రాష్ట్ర రాజధానిగా అమరావతిని మార్చే ఆలోచన ఏదీ లేదని ప్రభుత్వం తాజాగా క్లారిటి ఇచ్చింది.  రాజధానిని మారుస్తున్నారా అంటూ టిడిపి అడిగిన ప్రశ్నకు శాసనమండలిలో మున్సిపల్ మంత్రి బొత్సా సత్యనారాయణ సమాధానమిస్తు రాజధానిగా అమరావతిని మార్చే ఉద్దేశ్యం ఏదీ లేదని స్పష్టంగా చెప్పారు. దాంతో రాజధాని మార్పుకు సంబంధించి ప్రభుత్వం క్లారిటి ఇచ్చినట్లైంది.

 

కొద్ది రోజులుగా తెలుగుదేశంపార్టీ నేతలు, ఎల్లోమీడియా రాజధాని మార్పుపై ఒకటే గోల చేస్తున్న  విషయం అందరికీ తెలిసిందే.  రాజధాని మారుస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి ఎక్కడా చెప్పలేదు. అదే సమయంలో రాజధాని ప్రాంతంలో నిర్మాణాల విషయంలో పెరిగిపోయే వ్యయం గురించి బొత్స తదితరులు చేసిన వ్యాఖ్యలతో రాజకీయంగా హీటెక్కిపోయింది.

 

ఎప్పుడైతే బొత్స  ఒకటికి రెండు ప్రకటనలు చేశారో రాజధాని మార్పు తప్పదంటూ ఎల్లోమీడియా, టిడిపి ఒకటే ఊదరగొట్టేసింది. దాంతో జనాలందరిలో కూడా ఒక విధమైన గందరగోళం చోటు చేసుకున్న మాట వాస్తవం. దానికితోడు అమరావతి ప్రాంతంలో అప్పుడే మొదలైన నిర్మాణాలను నిలిపేయటం కూడా అనుమానాలకు ఊతమిచ్చింది.

 

సరే ఏదేమైనా మొత్తానికి శాసనమండలిలో రాజధానిపై లిఖితపూర్వక సమాధానం ద్వారా రాజధానిని మార్చే ఉద్దేశ్యమేదీ లేదని చెప్పటం ఇప్పటికైనా సంతోషం కలిగించేదే. అదే సమయంలో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, రాజ్ భవన్ శాస్వత భవనాలను ఎక్కడ నిర్మిస్తారనే విషయంలో మాత్రం క్లారిటి లేదు. హై కోర్టును కర్నూలుకు తరలించేస్తారనే ప్రచారం మాత్రం ఆగలేదు.

 

అలాగే మిగిలిన శాస్వత భవనాలను మంగళగిరిలోని ఏదో ఓ ప్రాంతంలో అంటే ఇపుడున్న వెలగపూడికి ఓ పది కిలోమీటర్ల దూరంలో నిర్మించబోతున్నట్లు పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా నిర్మించే శాస్వత భవనాలేదో తొందరగానే నిర్మించేస్తే గందరగోళం తగ్గుతుంది.  చంద్రబాబునాయుడు అండ్ కో తో పాటు ఎల్లోమీడియా కూడా ముందు గోల చేసినా తర్వాత అదే సర్దుకుంటుందనటంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: