దేశాన్నే కుదిపేసిన దిశ హత్యాచార ఘటనపై ఏపీ ప్రభుత్వం దిశ చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టానికి అసెంబ్లీ కూడా ఆమోదం తెలపడంతో దిశ తండ్రి, సోదరి హర్షం వ్యక్తం చేశారు. 'ముఖ్యమంత్రి జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ఏపీ ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకురావడం సంతోషించదగ్గ విషయం. ఇందుకు సీఎం జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. దిశ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కోరుతున్నాం’ అని వారు వ్యాఖ్యానించారు. 

 

 

దిశ ఘటన నేపథ్యంలో అత్యాచార ఘటనలను నియంత్రించడం, మహిళలు, చిన్నారులకు మరింత భద్రత కల్పించే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం దిశ చట్టాన్ని రూపొందించింది. ఈమేరకు అసెంబ్లీలో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టిన వెంటనే సభ్యులందరూ తమ ఆమోదం తెలిపారు. బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు. దిశ చట్టంపై సీఎం జగన్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ.. ‘ఆడపిల్లల తండ్రిగా ఈ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. విప్లవాత్మక చర్యలు తీసుకునే సమయమిది. నేరం చేస్తే ఎంతటివారినైనా వదలకూడదు. దిశ లాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. జిల్లాకో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తాం. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి.. అన్ని ఆధారాలుంటే 21 రోజుల్లో శిక్ష విధించడం దిశ చట్టం ముఖ్య ఉద్దేశ్యం' అన్నారు.

 

 

‘పోక్సో’ చట్టం ప్రకారం పిల్లలపై లైంగిక నేరాలు, లైంగిక వేధింపులకు పాల్పడితే ఉన్న 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకూ శిక్షను ఏపీలో జీవితఖైదుగా మార్చారు. సోషల్‌ మీడియాలో మహిళలను వేధించినా, అసభ్య పోస్టింగులు చేసినా, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా దిశ చట్టం ద్వారా మొదటి తప్పునకు 2 ఏళ్లు, రెండో తప్పునకు 4 ఏళ్లు శిక్ష విధించేలా ఐపీసీలో 354 (ఇ) అనే కొత్త సెక్షన్‌ను తీసుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: