మహారాష్ట్ర రాష్ట్రంలో ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి సర్కార్ మధ్య పదవుల పంపకం ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. మంత్రి వర్గ విస్తరణ త్వరలో జరగబోతూ ఉండగా ప్రస్తుతం ఏడుగురు మంత్రులు మొత్తం 56 శాఖల బాధ్యతలను చూసుకుంటున్నారు. కీలక శాఖల్లో శివసేన పార్టీకి పట్టణాభివృద్ధి, హోం శాఖలను కేటాయించగా కాంగ్రెస్ పార్టీకి రెవెన్యూ శాఖ ఎన్సీపీ పార్టీకి గృహ నిర్మాణ, ఆర్థిక శాఖలను కేటాయించారు. 
 
ఈ నెల 22 లేదా 23 తేదీలలో మంత్రి వర్గ విస్తరణ జరగబోతుందని సమాచారం. వారం రోజుల పాటు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు 16వ తేదీ నుండి జరగబోతున్నాయి. ఉద్ధవ్ ఎన్సీపీ పార్టీని కీలక శాఖలను తన వద్దే ఉంచుకోవటానికి ఒప్పించటం గమనార్హం. ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకరం చేసిన 14 రోజుల తరువాత కూడా శాఖల కేటాయింపు జరగకపోవటంతో ఎమ్మెల్యేలు అసంతృప్తికి గురయ్యారు. 
 
మూడు పార్టీలకు సముచిత స్థానం కలిగేలా శాఖల కేటాయింపు తాత్కాలికంగా జరిగిందని ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ కలిసి శాఖల కేటాయింపు గురించి నిర్ణయం తీసుకున్నారని ఒక సీనియర్ సభ్యుడు చెప్పారు. సీనియర్ సభ్యుడు మాట్లాడుతూ మహావికాస్ అఘాడీ కూటమి నేతలు చాలా సార్లు భేటీ అయిన తరువాత కేబినేట్ కూర్పు గురించి చర్చించారని పేర్కొన్నాడు. 
 
ఎన్సీపీ పార్టీకి చెందిన ఒక మంత్రి డిప్యూటీ సీఎం పదవి గురించి కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్టు వ్యాఖ్యలు చేశారు. స్పీకర్, డిప్యూటీసీఎం పదవుల్లో కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు చెరో పదవిని పంచుకోబోతున్నట్లు సమాచారం. జయంత్ పాటిల్ లేదా అజిత్ పవార్ ఎవరో ఒకరు డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. నాగ్ పూర్ సమావేశాలు ముగిసిన తరువాత క్యాబినెట్ ను విస్తరిస్తున్నట్లు తెలిపారు. మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేసిన రెండు వారాల తరువాత శాఖల కేటాయింపుల ప్రక్రియ కొలిక్కి వచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: