తెలంగాణాలో జరిగిన దిశ హత్యాచార నిందితుల ఎన్ కౌంటర్ ను సమర్ధిస్తు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా తప్పు. ప్రైవేటు సంభాషణల్లో మాట్లాడుకోవాల్సిన మాటలన్నింటినీ జగన్ నిండు అసెంబ్లీలో చేసి ఉండకూడదు. ఎన్ కౌంటర్ పై మానవ హక్కుల సంఘం, సుప్రింకోర్టు విచారణ జరపటాన్ని జగన్ అసెంబ్లీ తప్పు పడుతూ మాట్లాడటం చాలా మందిని ఆశ్చర్యపరిస్తోంది.

 

హత్యాచారం తప్పు అంటున్న వాళ్ళే అందుకు బాధ్యులను ఎన్ కౌంటర్ చేయటం మాత్రం  తప్పు అని ఎలా మాట్లాడుతారు ? అంటూ ప్రశ్నించటమే విచిత్రంగా ఉంది.  ఎన్ కౌంటర్ పై విచారణ జరిపి మానవ హక్కుల సంఘం, సుప్రింకోర్టు విచారణ జరిపి ఏమి తేలుస్తుంది ? అని అడగటమే విడ్డూరంగా ఉంది. ఎన్ కౌంటర్ తప్పంటే భవిష్యత్తులో హత్యాచార నిందితులపై కఠిన చర్యలు తీసుకోవటానికి ఏ పోలీసుఅధికారి కూడా ముందుకు రారని జగన్ చెప్పటమే విచిత్రంగా ఉంది.

 

ఒకవైపు ఎన్ కౌంటర్ తప్పని చట్టం, న్యాయస్ధానాలు అంటుంటే జగన్ మాత్రం వాటినే సవాలు చేసేలా మాట్లాడటం ఎంతమాత్రం మంచిది కాదు. ఎన్ కౌంటర్ ను ఎవరూ సమర్ధించకూడదు. ఎందుకంటే ఒకసారి ఎన్ కౌంటర్ ను సమర్ధిస్తే ప్రతి కేసులోను పోలీసులు ఇలాగే వ్యవహరిస్తారు. ఇప్పటికే పోలీసులు అపరిమితమైన అధికారాలతో డ్యూటీలు చేస్తున్నారు.

 

తప్పు చేసిన వారికందరికీ శిక్షలు పడుతున్నాయని, అమాయకులకు, బాధితులకు పోలీసుల ద్వారా  న్యాయం జరుగుతుందని గుండెల మీద చెయ్యేసుకుని చెప్పేంత దమ్ము మనకు లేదు.  ఎన్ కౌంటర్ కు ప్రభుత్వాలు  మద్దతుగా నిలబడితే ఇక పోలీసులకు పట్టపగ్గాలుండవు.  ఎవరినిబడితే వారిని ఎన్ కౌంటర్ చేసేయటానికి ఏమాత్రం వెనకాడరన్న విషయం అందరికీ తెలుసు. ఎవరికి ఎటువంటి శిక్షలు పడినా అది న్యాయ విచారణ ద్వారా మాత్రమే జరగాలి. ఈ విషయాలను మరచిపోయి జగన్ అసెంబ్లీలో ఎన్ కౌంటర్లకు మద్దతుగా మాట్లాడటం ముమ్మాటికీ తప్పే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: